Devaguptam
-
చంద్రయాన్–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్ బాబు
అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్‌బాబు ఒకరు. చంద్రయాన్–3 ప్రాజెక్టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) క్రయోజెనిక్ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివిన సురేశ్ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్ పొందారు. చంద్రయాన్–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ ఈతకోట సతీష్, జగనన్న గృహ సారథుల కన్వీనర్ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇది మీకు తెలుసా?.. పాండవులు బంగారాన్ని ఇక్కడే దాచారట!
అల్లవరం(తూర్పుగోదావరి జిల్లా): శతాబ్దాలుగా చరిత్రకు అందని అనేక విషయాలు కాలగమనంలో కలిసిపోతున్నాయి. కొత్త నీరు రాకతో పాతనీరు పోతుందనే మాదిరిగా పురాణ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, ఆలయాలు, రాజులు పాలించిన నగరాలు సైతం చరిత్ర పుటల్లోకెక్కని విశేషాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే. అలాంటివి అల్లవరం మండలంలో ఓడలరేవు, దేవగుప్తం గ్రామాలు ఉన్నాయి. వందల ఏళ్ల కిందట విశేష ఆదరణ పొంది నేడు ఆయా ఊర్ల పేర్లతో పిలువబడుతున్నాయి. ఆంగ్లేయులు వర్తకం పేరుతో భారతదేశ సంపదను తమ దేశానికి తరలించుకు పోవడానికి వారికి అనువైన ప్రాంతాలను ఎంచుకుని ఇక్కడ దొరికే ముడి సరుకును ఎగుమతి చేసుకునేందుకు అల్లవరం మండలం ఓడలరేవులో ఓడరేవుని ఏర్పాటు చేశారన్న విషయం అందరికీ తెలియదు. దేవగుప్తంలో అప్పట్లో రాజుల కోట ఉన్న ప్రాంతం ఇలా.. ఆంగ్లేయులు వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన ఓడరేవు నేడు ఓడలరేవుగా రూపాంతరం చెందింది. ఇక్కడ తెర చాప ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరమ్మతులు కూడా ఇక్కడే నిర్వహించే వారని ప్రసిద్ధి. అల్లవరం మండల పరిసర ప్రాంతాల్లో లభించే డొక్క తాడు, ధాన్యం, ఆముదాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరినార వంటి ఉత్పత్తులు రంగూన్, ఇండోనేషియా, అండమాన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. చిరు ధాన్యాలు, ఉక్కు, టేకు కలప, నూనెలు ఇక్కడ ప్రజల అవసరాలకు దిగుమతి చేసుకునేవారు. అలా ఓడల వ్యాపారంగా ప్రసిద్ధి చెందిన ఓడరేవు నేడు ఓడలరేవుగా పిలువబడుతోంది. ఇది మీకు తెలుసా? మండలంలో చరిత్రకెక్కని మరో గ్రామం దేవగుప్తం. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం గుప్తుల కాలానికి చెందిన దేవగుప్తుడు అనే రాజు ఇక్కడ నుంచి పాలన సాగించారని పెద్దలు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని కోటమెరకగా ఇప్పటికీ పిలుస్తుంటారు. ఇక్కడ చాలా మందికి ఇళ్ల నిర్మాణ సమయాల్లో లంకె బిందెలు దొరికినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి వద్ద ఉన్న బంగారాన్ని ఈ గ్రామంలో ఓ చోట దాచిపెట్టారని, అందుకే దేవగుప్తంగా పిలుస్తున్నారని నమ్మకం.