ఓడలరేవులో ఓడల స్థానంలో ప్రస్తుతం దర్శనమిస్తున్న సోనా బోట్లు
అల్లవరం(తూర్పుగోదావరి జిల్లా): శతాబ్దాలుగా చరిత్రకు అందని అనేక విషయాలు కాలగమనంలో కలిసిపోతున్నాయి. కొత్త నీరు రాకతో పాతనీరు పోతుందనే మాదిరిగా పురాణ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, ఆలయాలు, రాజులు పాలించిన నగరాలు సైతం చరిత్ర పుటల్లోకెక్కని విశేషాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే.
అలాంటివి అల్లవరం మండలంలో ఓడలరేవు, దేవగుప్తం గ్రామాలు ఉన్నాయి. వందల ఏళ్ల కిందట విశేష ఆదరణ పొంది నేడు ఆయా ఊర్ల పేర్లతో పిలువబడుతున్నాయి. ఆంగ్లేయులు వర్తకం పేరుతో భారతదేశ సంపదను తమ దేశానికి తరలించుకు పోవడానికి వారికి అనువైన ప్రాంతాలను ఎంచుకుని ఇక్కడ దొరికే ముడి సరుకును ఎగుమతి చేసుకునేందుకు అల్లవరం మండలం ఓడలరేవులో ఓడరేవుని ఏర్పాటు చేశారన్న విషయం అందరికీ తెలియదు.
దేవగుప్తంలో అప్పట్లో రాజుల కోట ఉన్న ప్రాంతం ఇలా..
ఆంగ్లేయులు వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన ఓడరేవు నేడు ఓడలరేవుగా రూపాంతరం చెందింది. ఇక్కడ తెర చాప ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరమ్మతులు కూడా ఇక్కడే నిర్వహించే వారని ప్రసిద్ధి. అల్లవరం మండల పరిసర ప్రాంతాల్లో లభించే డొక్క తాడు, ధాన్యం, ఆముదాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరినార వంటి ఉత్పత్తులు రంగూన్, ఇండోనేషియా, అండమాన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. చిరు ధాన్యాలు, ఉక్కు, టేకు కలప, నూనెలు ఇక్కడ ప్రజల అవసరాలకు దిగుమతి చేసుకునేవారు. అలా ఓడల వ్యాపారంగా ప్రసిద్ధి చెందిన ఓడరేవు నేడు ఓడలరేవుగా పిలువబడుతోంది.
ఇది మీకు తెలుసా?
మండలంలో చరిత్రకెక్కని మరో గ్రామం దేవగుప్తం. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం గుప్తుల కాలానికి చెందిన దేవగుప్తుడు అనే రాజు ఇక్కడ నుంచి పాలన సాగించారని పెద్దలు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని కోటమెరకగా ఇప్పటికీ పిలుస్తుంటారు. ఇక్కడ చాలా మందికి ఇళ్ల నిర్మాణ సమయాల్లో లంకె బిందెలు దొరికినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి వద్ద ఉన్న బంగారాన్ని ఈ గ్రామంలో ఓ చోట దాచిపెట్టారని, అందుకే దేవగుప్తంగా పిలుస్తున్నారని నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment