అదొక అత్యంత అద్భుతమైన ఘట్టం. 1969 జులై 20వ తేదీన.. ‘ఈగిల్’ లునార్ మాడ్యుల్ నుంచి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొట్టమొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ రెండో వ్యక్తిగా అడుగుపెట్టగా.. ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను పాతి చరిత్రకెక్కారు. చందమామ కలను మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి. అయితే ఆ ఘనత నిజమేనా అనుమానాలు తరచూ వ్యక్తం అవుతుంటాయి.. అందుకు కారణాలు లేకపోలేదు.
జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. లునార్ మాడ్యుల్ ‘ఈగిల్’ కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, పైలెట్ బజ్ అల్‌డ్రిన్, కమాండ్ మాడ్యూల్ ‘కొలంబియా’ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్‌లో పయనం అయ్యారు. అంతరిక్షంలో సుమారు రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో.
ఉత్కంఠ రేకెత్తిస్తూ..
జులై 19వ తేదీ.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్‌లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్‌డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్‌కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.
సుమారు ఐదు గంటల తర్వాత మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది.
“That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET).
బజ్ అల్‌డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ కదా!
ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్‌క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్‌మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్‌టైం’.
ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు..
చుక్కలు కనపడాలి కదా!
బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్‌లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు.
చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయని నాసా వివరణ ఇచ్చింది.
ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన.
ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్ష్యాలు.. అన్నింటికి మించి సుమారు 24 బిలియన్ల డాలర్ల ఖర్చుతో రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట.
చంద్రయాన్-3 నేపథ్యంలో సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment