హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది.
అయితే ఫండ్‌రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది.
రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్‌ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్‌లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు.
టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు.
గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment