Rocket Center
-
రూ.225 కోట్ల నిధులు సమీకరించిన స్కైరూట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫండ్‌రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది. రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది. -
మరో రాకెట్‌ను ప్రయోగించనున్న స్కైరూట్.. తేదీ ఎప్పుడంటే..
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. అంతర్జాతీయంగా స్పేస్ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు రాకెట్లును పంపుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ మనదేశంలో ఇస్రో తప్పించి రాకెట్లు తయారు చేసిన సంస్థ మరొకటేదీ లేదు. తొలిసారిగా హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ గతేడాది విక్రమ్-ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంతో విక్రమ్-1ను లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతుంది. స్కైరూట్ సంస్థ రూపొందించిన ‘విక్రమ్-1’ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రధానకార్యాలయం(మ్యాక్స్-క్యూ)ను మంత్రి సందర్శించి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న స్పేస్, బయోటెక్, అగ్రికల్చర్ రంగాల్లో యువతకు అపారఅవకాశాలు ఉన్నాయని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో స్టార్టప్ సంస్థల సామర్థ్యాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించాలని ప్రధాని మోదీ కాంక్షిస్తున్నారని చెప్పారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ చందన మాట్లాడుతూ అసాధారణమైన వాటిని సాధించినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. సంస్థ సీఓఓ భరత్ డాకా మాట్లాడుతూ విక్రమ్-1 డిజైన్ దేశీయంగా తయారుచేసినట్లు చెప్పారు. విక్రమ్-1 దాదాపు 300కిలోల పేలోడ్‌ను భూదిగువ కక్ష్యలోకి మోసుకెళ్లే రాకెట్. ఈ ప్రయోగం వివిధ దశల్లో జరుగుతుంది. దీన్ని పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. విక్రమ్-1ను 2024లో ప్రయోగించనున్నారు. స్కైరూట్ క్యార్యాలయం అయిన మ్యాక్స్-క్యూలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్‌తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 300 మంది పనిచేసేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. -
విమానం టికెట్‌తో అంతరిక్షానికి!
సాక్షి, హైదరాబాద్: విమానం టికెట్‌తో అంతరిక్షంలోకి ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవని, మరో పదేళ్లలోనే అది సాధ్యమవుతుందని స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన అన్నారు. రాకెట్ల నిర్మాణానికి హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా అనుకూలమైందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను తయారు చేసిన సంస్థ స్కైరూట్ అనే విషయం తెలిసిందే. ఫిక్కీలేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే అంతరిక్షానికి ఎగిరిన తమ రాకెట్ పూర్తిగా హైదరాబాద్‌లోనే తయారైందని, అది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైనదని పేర్కొన్నారు. సొంతంగా ఉపగ్రహాలను తయారు చేసుకోగల సామర్థ్యం చాలా కొద్దిదేశాలకే ఉందని, భారత్ ఈ రంగంలో ఇప్పటికే ముందు వరసలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ కూడా అంతరిక్ష రంగంలో ఓ ప్రధానకేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా వంద నుంచి 150 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంటే, రానున్న పదేళ్లలో వీటి సంఖ్య పదివేలకు తరువాతి పదేళ్లలో 40 వేలకూ చేరుకుంటుందని చెప్పారు. అంతరిక్షంలో విహారయాత్రలకు పాశ్చాత్య దేశాలు సిద్ధమవుతున్నాయని, భారత్‌లోనూ ఇంకో పదేళ్లకు ఇది సాధ్యం కావచ్చని పవన్‌కుమార్ తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రస్తుతానికి ఈ అంశంపై దృష్టి పెట్టడంలేదన్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ తయారు చేస్తున్న రాకెట్ ‘విక్రాంత్ 1’ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదని, దీని ప్రయోగం వచ్చే ఏడాది జరగవచ్చని తెలిపారు. ఇప్పటివరకూ రాకెట్ల ద్వారా గరిష్టంగా పదిమంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుందని, ఎక్కువ మందితో ప్రయాణించే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం దేశంలో అంతరిక్ష పరిజ్ఞానం వృద్ధిలో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతైనా ఉందని, స్టార్టప్ కంపెనీలు ధ్రువ స్పేస్, స్కై రూట్ ఏరోస్పేస్‌లు హైదరాబాద్‌లో ఉండటం, రాకెట్ ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట ఏపీలో ఉండటాన్ని పవన్‌కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏరోస్పేస్ రంగంలో ఇప్పటికీ మహిళల భాగస్వామ్యం పదిశాతం మాత్రమే ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ కల్పనా చావ్లా స్ఫూర్తితో మరింతమంది ఈ రంగంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాలసీ బజార్ వైస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అలోక్ బన్సర్, రాపిడో బైక్ షేరింగ్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుంటుపల్లి పవన్ తదితరులు కూడా స్టార్టప్ రంగంలో తమ అనుభవాలను పంచుకున్నారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ–సీ40
-
విజయవంతంగా భూస్థిర పరీక్ష
శ్రీహరికోట(సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) భవిష్యత్తులో భారీ ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌లో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆదివారం ఉదయం 9.30 గంటలకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో భూ స్థిర పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 18న జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని నిర్వహించి, ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు రెండుసార్లు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. ఆ ప్రయోగంలో ఎస్-200 బూస్టర్‌లో పీడనం ఎక్కువగా ఉన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని భావిం చిన శాస్త్రవేత్తలు, పీడనం పరిమాణం తగ్గించి ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 2016లో జీఎస్ఎల్వీ మార్క్3-డీ1 ప్రయోగాన్ని ఈ తరహా బూస్టర్లతో నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. 200 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి, దాని సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్షలను నిర్వహించారు. భవిష్యత్తులో సుమారు 3 నుంచి 5 టన్నులు బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి పంపాలంటే ఎస్-200 లాంటి స్ట్రాపాన్ బూస్టర్లు అవసరమన్నారు. ఎస్-200 పరీక్షలు వరుసగా విజయవంతం అవుతున్నందున భవిష్యత్తులో భారీప్రయోగాలకు తిరుగుండదని చెప్తున్నారు. కార్యక్రమంలో షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్, అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, జీఎస్ఎల్వీ డెరైక్టర్ అయ్యప్పన్, ఎస్-200 ప్రాజెక్ట్ డెరైక్టర్ ఈశ్వరన్ పాల్గొన్నారు.