శ్రీహరికోట(సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) భవిష్యత్తులో భారీ ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌లో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆదివారం ఉదయం 9.30 గంటలకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో భూ స్థిర పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 18న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాన్ని నిర్వహించి, ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు రెండుసార్లు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు.
ఆ ప్రయోగంలో ఎస్-200 బూస్టర్‌లో పీడనం ఎక్కువగా ఉన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని భావిం చిన శాస్త్రవేత్తలు, పీడనం పరిమాణం తగ్గించి ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 2016లో జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ1 ప్రయోగాన్ని ఈ తరహా బూస్టర్లతో నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. 200 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి, దాని సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్షలను నిర్వహించారు.
భవిష్యత్తులో సుమారు 3 నుంచి 5 టన్నులు బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి పంపాలంటే ఎస్-200 లాంటి స్ట్రాపాన్ బూస్టర్లు అవసరమన్నారు. ఎస్-200 పరీక్షలు వరుసగా విజయవంతం అవుతున్నందున భవిష్యత్తులో భారీప్రయోగాలకు తిరుగుండదని చెప్తున్నారు. కార్యక్రమంలో షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్, అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, జీఎస్‌ఎల్‌వీ డెరైక్టర్ అయ్యప్పన్, ఎస్-200 ప్రాజెక్ట్ డెరైక్టర్ ఈశ్వరన్ పాల్గొన్నారు.
విజయవంతంగా భూస్థిర పరీక్ష
Published Mon, Jun 15 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM
Advertisement