డబ్లిన్: భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వర్షంతో ముగింపు లభించింది. బుధవారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వాన కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. నిర్విరామంగా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది.
మధ్యలో కొద్దిసేపు వాన తీవ్రత తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా... కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్ ఖాతాలో 2–0తో సిరీస్ చేరింది. భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
‘చంద్రయాన్’ను వీక్షిస్తూ...
మ్యాచ్ రోజు డబ్లిన్‌లో భారత క్రికెటర్లు టీవీలో ‘చంద్రయాన్–3’ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ సమయం గడిపారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టిన క్షణాన సంబరాలు చేసుకుంటూ భావోద్వేగంతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. మరోవైపు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టార్ ప్లేయర్ కోహ్లి తదితరులు తమ సంతోషాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ‘ఇస్రో’కు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment