మహోన్నత ఘట్టం | Sakshi Editorial Special Story On Chandrayaan-3 Moon Mission Research In Telugu - Sakshi
Sakshi News home page

Chandrayaan 3 Success: మహోన్నత ఘట్టం

Published Thu, Aug 24 2023 1:00 AM | Last Updated on Thu, Aug 24 2023 9:44 AM

Sakshi Editorial On Chandrayaan-3 Research

కోట్లాదిమంది భారతీయులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఒక అపురూపమైన, మహోన్నతమైన ఘట్టం అంతరిక్షంలో ఆవిష్కృతమైంది. సహస్రాబ్దాలుగా విశ్వ మానవాళికి కనువిందు చేస్తున్న చందమామపై పరిశోధనల కోసం మన శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌ బుధవారం అఖండ విజయం సాధించింది. ఎవరికీ లొంగిరాని చంద్రుడి తలంపైనున్న దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని పరిశోధనల కోసం ఎంచుకుని, విక్రమ్‌ ల్యాండర్‌ను అక్కడే దించితీరాలన్న లక్ష్యంతో పనిచేసిన మన శాస్త్రవేత్తల సాహస ప్రయత్నం సాకారం కావడం ప్రపంచ దేశాలను అబ్బురపరి చింది.

దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌ సరిగ్గా అనుకున్నచోటే, అనుకున్న సమయానికే సురక్షితంగా కాలూనడం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పరంపరను కీలక మలుపు తిప్పే ఒక అసాధారణ విన్యాసం. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇదొక చారిత్రక ఘట్టం. దీని వెనక వందలాదిమంది శాస్త్రవేత్తల నాలుగేళ్ల నిరంతర కృషి, దృఢసంకల్పమూ పెనవేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గత 41 రోజులుగా అన్ని విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలూ పరస్పర సమన్వయంతో రాత్రింబగళ్లు పనిచేస్తూ చంద్రయాన్‌ గమనాన్ని కళ్లల్లో వత్తులు వేసుకుని చూశారు.

రెప్పవాల్చని నిఘాతో ఎప్పటికప్పుడు దాన్ని నిశితంగా గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుతో ముడిపడిన శాస్త్ర, సాంకేతిక సిబ్బంది అందరూ చంద్రయాన్‌నే శ్వాసించారు. మరే వ్యాపకమూ లేదన్నట్టు ఈ ప్రాజెక్టుపైనే తమ సర్వశక్తులూ కేంద్రీకరించారు. మన శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వైఫల్యాల శాతం అతి తక్కువ. చంద్రయాన్‌–2 ప్రాజెక్టులో పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి గురుత్వాకర్షణ వేగాన్ని అధిగమించలేక విఫలమైందన్న మాటేగానీ, దాంతోపాటు పంపిన ఆర్బిటర్‌ ఇంకా పనిచేస్తూ ప్రస్తుత ప్రాజెక్టుకు అవసరమైన డేటాను అందించింది.

గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్‌–3 వ్యోమనౌక కక్ష్యను శాస్త్రవేత్తలు దశలవారీ పెంచుతూ రాగా, ఈనెల 1న భూ కక్ష్యను దాటుకుని చంద్రుడి కక్ష్య దిశగా అది దూసుకెళ్లింది. మరో నాలుగురోజులకు చంద్రుడి కక్ష్యలో చేరగా, ఆనాటినుంచీ దాని కక్ష్యను తగ్గించుకుంటూ వచ్చారు. ల్యాండర్‌ను కిందకు దించే ప్రక్రియను కొనసాగించాలా లేదా అన్నది కేవలం కొన్ని గంటలముందు నిర్ణయించవలసివుంటుంది.

అప్పుడు కూడా అంతా సవ్యంగానే సాగుతున్నదని నిర్ధారించుకుని సరిగ్గా ముందనుకున్నట్టే సాయంత్రం 5.45కి ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి మళ్లించే దశకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఏ దశలోనూ చంద్రయాన్‌ –3కి అవాంతరాలు ఎదురుకాకపోవటం, చివరకు శాస్త్రవేత్తలు సైతం అత్యంత కష్టసాధ్యమైనదని భావించిన చివరి 17 నిమిషాలూ అంచనాలకు అనుగుణంగా ముగియటం అనితర సాధ్యమైన ప్రక్రియ. ల్యాండింగ్‌ సమయంలో ఏ వ్యవస్థ విఫలమైనా ఆ వెంటనే మరో వ్యవస్థ దాన్ని నెర వేర్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 

వివిధ దేశాలు చంద్రుడిపైకి ఇంతవరకూ మొత్తం 18 వ్యోమనౌకలు పంపగా, అందులో 40 శాతం విఫలమయ్యాయి. 1959 జనవరిలో పూర్వపు సోవియెట్‌ యూనియన్‌ తొలి వ్యోమనౌకను పంపింది. 1976 తర్వాత... అంటే 47 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు జరిపిన రెండో లూనా–25 ప్రయోగంఆ దేశాన్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈనెల 19న తమ వ్యోమనౌక విఫలమైందని ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆ మరునాడు ప్రకటించింది. అంతరిక్ష రంగంలో కాకలు తీరిన సంస్థే విఫలమైందంటే ఇలాంటి ప్రాజెక్టుల్లో ఎన్ని సంక్లిష్టతలు ఇమిడివుంటాయో అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి మన చంద్రయాన్‌–2 ప్రాజెక్టుకు సహకరించడానికి అప్పట్లో రష్యా ముందుకొచ్చింది. 2011–12 మధ్య జరగాల్సిన ఆ ప్రయోగానికి రాకెట్, ఆర్బిటర్‌ మనం సమకూర్చుకోవటానికి, ల్యాండర్, రోవర్‌లను రష్యా అందించటానికి అవగాహన కుదిరింది. తీరా ఆ రెండూ వేరే ప్రయోగాల్లో విఫలం కావటం, రష్యా రూపొందించిన కొత్త డిజైన్లు మన రాకెట్‌కు అనువుగాలేని కారణంగా వాటిని సొంతంగానే రూపొందించుకోవాలని ఇస్రో నిర్ణయించింది. అందువల్లే 2019కి గానీ చంద్ర యాన్‌–2 సాధ్యపడలేదు. అందులో ఎదురైన వైఫల్యాల నుంచి గుణపాఠం తీసుకోబట్టే తాజా విజయం చేతికందింది.

చంద్రుడిపై అతి శీతల ప్రాంతమైన దక్షిణ ధ్రువంలో ఇంతవరకూ ఏ దేశమూ తలపెట్టని అరుదైన ప్రయోగాలు ప్రజ్ఞాన్‌ రోవర్‌ నిర్వహిస్తుంది. చంద్రుడిపై ఉన్న మట్టిని, అక్కడి శిలలను సేకరించి మౌలిక, రసాయన సమ్మేళనాల డేటాను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపుతుంటుంది. ఉపరితలంపై ఉన్న మట్టిలోని అయాన్లనూ, ఎలక్ట్రాన్లనూ, వాటి సాంద్రతనూ మదింపు వేస్తుంది. వాటిల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులను పసిగడుతుంది. ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతనూ, అక్కడ వచ్చే కంపనాలనూ అంచనా వేస్తుంది. ఈ ప్రయోగాలన్నీ అది ఒక చాంద్రదినం (మనకు 14 రోజుల కాలం)లో పూర్తిచేయాల్సివుంటుంది. ఆ తర్వాత దాని జీవనయానం ముగుస్తుంది.

సాంకేతికంగా ఎన్నో సంక్లిష్టలతో నిండివున్న ఈ ప్రయోగానికి సిద్ధపడటం, వేరే దేశాలతో పోలిస్తే దాన్ని అత్యంత చౌకగా (ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 600 కోట్లు) పూర్తి చేయటం మన శాస్త్రవేత్తల సమర్థతను తెలియజేస్తుంది. అణ్వస్త్ర దేశంగా, అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ ప్రతిష్టను చంద్రయాన్‌–3 ఘన విజయం మరింత పెంచింది. ఇది మరిన్ని ప్రయోగాలకు దోహద పడి మొత్తంగా మానవాళి జ్ఞానాన్ని మరింత సునిశితం చేయగలదని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement