సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ల్యాండర్ మాడ్యూల్ చందమామకు మరింత చేరువగా వచ్చింది. మాడ్యూల్‌లోని ఇంధనాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్వల్పంగా మండించి లూనార్ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి 113గీ157 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది.
ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞాన్’తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ నెల 20న తెల్లవారుజామున 2 గంటలకు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నారు. ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్లనున్నారు. రెండో విడత కక్ష్య దూరం తగ్గింపు అనంతరం ఈ నెల 23న ల్యాండర్ మాడ్యూల్‌ను కక్ష్య దూరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియ నిర్వహిస్తారు.
చంద్రుడి ఫొటోలు పంపించిన చంద్రయాన్–3
చంద్రయాన్–3 మిషన్ చందమామకు 113 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా చిత్రీకరించిన ఛాయాచిత్రాలు, వీడియోలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. చంద్రయాన్–3 వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్‌పీడీసీ) ఆగస్టు 15న, ల్యాండర్ ఇమేజర్(ఎల్‌ఐ) కెమెరా–1 ఆగస్టు 17న ఈ చిత్రాలు, వీడియోలను చిత్రీకరించాయి. భూ నియంత్రిత కేంద్రానికి పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై మట్టి దిబ్బలు, అఖాతాలు ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జాబిల్లికి చేరువగా ల్యాండర్ మాడ్యూల్
Published Sat, Aug 19 2023 6:02 AM | Last Updated on Sat, Aug 19 2023 7:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment