భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రయోగాత్మక ప్రయోగాలు చేయడంలో మరో మారు దిట్ట అని నిరూపించుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికల్(ఏటీవీ) ప్రయోగాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. షార్‌లోని సౌండింగ్‌రాకెట్లు ప్రయోగవేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 3277 కిలోల బరువుతో మొదటిదశ ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్‌తో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపాందించిన రోహిణి 560 సౌండింగ్ రాకెట్‌కు స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అమర్చి పరీక్షించారు. ఈ ప్రయోగంలో శ్యాస, వాయు, చోదక వ్యవస్థ పరిజ్ఞానం కలిగిన సూపర్ సోనిక్ కంబషన్ రామ్‌జెట్ (స్క్రామ్‌జెట్) ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆర్‌హెచ్-560 రాకెట్ రెండో దశకు అమర్చిన స్ట్రామ్‌జెట్ ఇంజిన్‌ను 70 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి మొదటిదశ విడిపోయి బంగాళాఖాతంలో పడిపోయింది. ఆ తరువాత స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను సుమారు 5సెకెండ్లపాటు మండించి పరీక్షించి విజయం సాధించారు. భూవాతావరణంలోని గాలిని ఉపయోగించుకుని భవిష్యత్తులో రాకెట్ వ్యయం తగ్గించేందుకు చేపట్టిన ఈ ప్రయోగాన్ని ఇస్రో పరిభాషలో ఈ ‘‘ఎయిర్ బ్రీతింగ్’’ సిస్టం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మహేంద్రగిరి, లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్‌సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో రూపొందించగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగాత్మక ప్రయోగంలో అమ్మోనియం పర్ క్లోరేట్స్ ఆక్సిడైజర్ బదులుగా భూవాతావరణంలోని గాలిని వినియోగించుకుని భవిష్యత్తు ప్రయోగాలు చేయడానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు.
సాధారణ రాకెట్ ప్రయోగాల్లో ఇంధనాన్ని మండించేందుకు ఇంధనంతోపాటు అమ్మోనియం పర్ క్లోరేట్ ఆక్సిడైజర్‌ను నింపి ప్రయోగం చేస్తుంటారు. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌లో ఆక్సిడైజర్ అవసరం లేకుండా అందులోని శ్యాస, వాయు, చోదక శక్తి పరిజ్ఞానంతో సూపర్‌సోనిక్ వేగంతో వీచే గాల్లోనుంచి ఆక్సిజన్‌ను తీసుకుని వినియోగించుకుంటారు. భూవాతారవరణంలోని నుంచి సేకరించిన అక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. మామూలు ప్రయోగాల మాదిరిగా ఆక్సిడైజర్‌ను మోసుకెళ్లే అవసరం లేకపోవడం వల్ల రాకెట్‌లో ఇంధన బరువును తగ్గించడం, తద్వారా రాకెట్ వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే మార్గం సుగమం అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.