
వ్యాబ్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ32
రేపు ఉదయం 10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ32 ఉపగ్రహ వాహక నౌకను ఆదివారం వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్(వ్యాబ్) నుంచి ఊంబ్లీకల్ టవర్ (ప్రయోగవేదిక)కు అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తైది. అనంతరం శాస్త్రవేత్తలు రాకెట్‌కు గ్లోబల్ చెకింగ్ చేశారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ అనుసంధానం పూర్తి చేసి సోమవారం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించనున్నారు.
వారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించిన తరువాత మంగళవారం ఉదయం 10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. 54 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా గురువారం సాయంత్రం 4 గంటలకు 1425 కిలోలు బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1ఎఫ్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు అంతా సిద్ధం చేశారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో ఆరో ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని 20.11 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ నెల 9న ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ షార్‌కు చేరుకుని ప్రయోగ పనులను పర్యవేక్షిస్తారు.