షార్‌లో అగ్నిప్రమాదం
నిల్వ ఉంచిన ఘన ఇంధనంలో మంటలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని ఘన ఇంధనం తయారీ విభాగం (స్ప్రాబ్)లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ భవనంలో ఎలాంటి యంత్ర పరికరాలు లేవు. కేవలం మిగిలిన ఘన ఇంధనాన్ని మాత్రమే ఈ భవనంలో నిల్వ చేస్తారు. అత్యంత పటిష్టమైన ఈ భవనంలోకి మంటలు ఎలా వ్యాపించాయనేది పశ్నార్థకంగా ఉంది. అమ్మోనియం ఫర్ క్లోరైడ్, ఆక్సిడైజర్, అల్యూమినియం పౌడర్‌ను కలిపి ఘన ఇంధనం తయారు చేస్తారు.
సరిపడినంత తీసుకుని మిగతా ఇంధనాన్ని 146 భవనం (పూర్తి కాంక్రీట్‌తో నిర్మించిన)లో నిల్వ చేస్తారు. ప్రమాద సమయంలో విధుల్లో ఎవరూ లేక ప్రాణనష్టం తప్పింది. కాగా ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న షార్ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వెళ్లి మంటల్ని అదుపు చేయించారు. నిల్వ ఇంధనంలో మంటలు ఎలా వచ్చాయనే దానిపై షార్ ఉన్నతాధికారుల బృందం ఆరా తీస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఒక కమిటీని వేయడానికి నిర్ణయించారు.