శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగించిన నెల వ్యవధిలోనే జిఎస్‌ఎల్‌వి ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 27న జీఎస్‌ఎల్‌వీడీ-6 రాకెట్ ప్రయోగాన్ని చేయనున్నట్లు షార్ డైరక్టర్ పీ. కున్హికృష్ణన్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని కల్పనా అథితి గృహంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 27న జీఎస్‌ఎల్‌వీడీ-6 రాకెట్ ద్వారా 2176 కిలోల బరువు కలిగిన జీశాట్-6 అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జి షాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
సెప్టెంబర్ 29న పీఎస్‌ఎల్‌వీ సీ-30 ద్వారా ఆస్త్రోశాట్ అనే ఉపగ్రహాంతో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను పంపనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఆఖరునాటికి పీఎస్‌ఎల్‌వీ సీ-29 ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్నామన్నారు. అదేవిధంగా త్రివేండ్రంలోని విక్రమ్‌సారాబాయ్ స్పేస్ సెంటర్‌లో తయారు చేస్తున్న ఎక్స్ ఎల్ స్ట్రాపాన్ బూస్టర్లు తయారు చేసే యూనిట్‌ను షార్‌లోనే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అనంతరం షార్‌లో మూడుకోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాలను ఆయన ప్రారంభించారు.