షార్‌లో అగ్ని ప్రమాదం
ఫీడ్‌లైన్‌ను శుభ్రపరుస్తుండగా వ్యాపించిన మంటలు
ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలు
25% కాలిపోయిన వర్టికల్ మిక్సర్ మిషన్
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) లోని ఘన ఇంధన విభాగం(స్ప్రాబ్) 169 భవనంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. వర్టికల్ మిక్సర్ మిషన్ దాదాపు 25% కాలిపోయింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు మొదటిదశలో ఉపయోగించే ఎస్-139 హెడ్ ఎండ్ సెగ్మెంట్ తయారు చేయడానికి రెండు రోజుల క్రితం ఫ్రీమిక్స్ పనులను పూర్తిచేశారు. తుది మిక్సింగ్ చేయడానికి సిద్ధమవుతూ గురువారం మిక్సర్, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఫీడ్‌లైన్‌ను శుభ్రపరుస్తున్న సమయంలో పెద్ద శబ్దంతో కూడిన మంటలు వ్యాపించాయి. పైపులైన్‌లో అల్యూమినియం ఫౌడర్, అమ్మోనియం ఫర్ క్లోరేట్ పౌడర్లు ఉండడంతో మంటలు చెలరేగి, మిక్సర్ మిషన్‌తో పాటు పైపులైన్లు కూడా కాలిపోయాయి.
అదే సమయంలో పైభాగంలో పనులు చేస్తున్న చిన్నకొండయ్య మెట్లమీద నడిచి వస్తూ మంటలను చూసి భయపడి ఒక్కసారిగా కిందకు దూకేయడంతో స్వల్పంగా గాయపడ్డాడు. పీఈఎల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి రాజేశంకు చేతులు కాలాయి. షార్ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. గాయపడిన ఇద్దరిని షార్ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ప్రమాదాలు పని ఒత్తిడి వల్ల జరుగుతున్నాయని షార్ ఉద్యోగులు అంటున్నారు. గతంలో ఏడాదికి ఒకటి, రెండు ప్రయోగాలు మాత్రమే చేసేవారని, ప్రస్తుతం ఐదారు ప్రయోగాలు చేయడం, అందుకు తగినట్టుగా ఉద్యోగుల సంఖ్యను పెంచకపోవడంతో పని ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఘన ఇంధనం మూటలు పక్కనే ఉండడంతో అక్కడ పనిచేస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ మంటలు వాటికి అంటుకోలేదు. వాటికిగాని అంటుకొని ఉంటే పెనుప్రమాదమే జరిగేదని షార్ వర్గాలు పేర్కొంటున్నాయి.