పౌరసరఫరాల శాఖభవనంలో అగ్నిప్రమాదం
-
పాత రికార్డులు దగ్ధం
నెల్లూరు(పొగతోట):
నెల్లూరు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి పాత రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 3.00 నుంచి 5.00 గంటల మధ్యలో చోటుచేసుకుంది. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, సమాచార, ప్రణాళిక తదితర శాఖల భవన సముదాయాలున్నాయి. పౌర సరఫరాల సంస్థ మూడు అంతస్తులుగా ఉంది. మంగళవారం తెల్లవారుజామున పేపర్ కటింగ్ డ్యూటీకి వచ్చిన డీపీఆర్‌ఓ కార్యాలయం సిబ్బంది పౌరసరఫరాల సంస్థ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని పాతరికార్డులు నిల్వచేసే గది నుంచి మంటలు రావడం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండో అంతస్తులో పడుకుని ఉన్న పౌరసరఫరాల సంస్థ వాచ్‌మెన్ మునయ్యను అప్రమత్తం చేసి కిందకు తీసుకువచ్చారు. మంటలకు అప్పటికే ఫ్లోర్ వేడెక్కిఉండటంతో చెప్పుల్లేకుండా వచ్చిన మునయ్య కాలికి స్వల్పగాయాలయ్యాయి. వాచ్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. కార్యాలయం మొత్తం పొగతో నిండిపోయింది. వేడికి కార్యాలయం గోడలు నెర్రెలిచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి అద్దాలు పగలగొట్టి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి జ్ఞానసుందరం ఆధ్వర్యంలో రెండు ఫైరింజన్లతో సిబ్బంది సుమారు 6 గంటలకు పైగా శ్రమించారు. జేసీబీ సహాయంతో కార్యాలయం గోడలను పగులగొట్టి తగలపడుతున్న రికార్డులను బయటకు తీసుకువచ్చి ఆర్పారు. అయితే పాత రికార్డులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ–పాస్ రశీదులు, పాత రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులు మంటల్లో కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగిన కార్యాలయాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ ఏ. మహమ్మద్‌ఇంతియాజ్, జేసీ–2 రాజ్‌కుమార్, నెల్లూరు డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాగా, డీఎస్‌ఓ టి.ధర్మారెడ్డి సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జి డీఎస్‌ఓ కనకనరసారెడ్డి కూడా సెలవులో ఉన్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ ఉండటంతో సీపీఓ పీబీకే మూర్తి సోమవారం రాత్రి 12.30 గంటల వరకు తన కార్యాలయంలో ఉండటం..మంటల ఉద్ధృతి, రికార్డుల కాలిన తీరును బట్టి సంఘటన తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల నడుమ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేశారు. ఫింగర్ ఫ్రింట్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు భవనాన్ని పరిశీంచి వినియోగానికి పనికిరాదని చెప్పారు. పాత జెడ్పీ ఆఫీసులో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. షార్ట్‌సఽర్కూ‍్యట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
సీఎంఆర్ రికార్డుల కోసమేనా..?
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణలో అనేక అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో ఈ కార్యాయలయంలోని రికార్డులను ఏసీబీ అధికారులు ఆగస్టులో పరిశీలించారు. ఈ కేసు విషయం ఇంత వరకు పరిష్కారం కాలేదు. 2.46 లక్షల టన్నుల సీఎంఆర్ ఇవ్వవలసి ఉంది. ఇప్పటి వరకు 2.21 లక్షల టన్నుల సీఎంఆర్ మిల్లర్లు ఇచ్చారు. రైస్ మిల్లర్ల నుంచి 25 వేల టన్నుల సీఎంఆర్ సేకరించవలసి ఉంది. సీఎఆర్ విషయంలో కార్యాలయం ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారనే అనుమానాలు ఉన్నాయి. సీఎంఆర్‌కు సంబంధించిన కొంత మంది ఉద్యోగులపై బదిలీవేటు పడింది. దీంతో సీఎంఆర్ రికార్డులను తగలబెట్టేందుకే కొందరు ప్రమాదం సృష్టించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీఎంఆర్‌కు సంబంధించిన రికార్డులు పదిలంగా ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు.