బస్టాండ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
-
రెండు కార్లు, ఒక టెంపో దగ్ధం
సంగం : స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కార్లు, ఒక టెంపో బూడిదయ్యాయి. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. సంగంకు చెందిన మస్తాన్ తన అంబాసిడర్ కారును, టెంపో వాహనాన్ని బస్టాండ్ సమీపంలోని కారు స్టాండ్ పక్కన నిలిపిగా, అదే గ్రామానికి చెందిన పాపిరెడ్డి తన అంబాసిడర్‌ను సైతం అక్కడే నిలిపి భోజనాలకు వెళ్లారు. ఈ వాహనాలు నిలిపిన చోట చెత్త ఎక్కువగా ఉండటంతో ఆ దారిలో వెళ్తున్న ఎవరో కాల్చిన బీడీ, సిగరెట్ వేయడంతో మంటలు రాజుకున్నాయి. మంటలు గమనించి స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అందుబాటులో నీటి వనరులు లేకపోవడంతో ఆలస్యమైంది. వాహన యజమానులు పాపిరెడ్డి, మస్తాన్‌కు సమాచారమిచ్చారు. అక్కడున్న కుళాయిల్లో నీళ్లు తీసుకుని చల్లినా మంటలు అదుపు కాక మూడు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ వాహనాల పక్కనే మరో ట్రాక్టర్, టెంపో ఉన్నా ప్రమాదం జరిగిన వెంటనే వాటిని డ్రైవర్లు పక్కకు తీయడంతో ప్రమాదం తప్పింది. ఆత్మకూరు నుంచి వచ్చిన అగ్నిమాపక వాహనం పూర్తిగా నిప్పులు ఆర్పివేశారు. ప్రమాదంలో రూ.7 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఎస్‌ఐ వేణు తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.