సాక్షి, నెల్లూరు : షార్ అంతరిక్షం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్08 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈరోజు సాయంత్రం 4.29 గంటలకు జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్08 రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-6ఏను ప్రయోగించింది. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుకుంది.
ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ తోటి శాస్త్రవేత్తలను అభినందించారు. జీ ఉపగ్రహాల్ని జీఎస్‌ఎల్వీ వాహకనౌకల ద్వారా ప్రయోగించడం ఇది 12వ సారి కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్ అమర్చిన జీఎస్‌ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు.
శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ
మరోవైపు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్08 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment