నెల్లూరు: జీఎస్ఎల్వీ-డి5 రాకెట్ ప్రయోగం విజయం శాస్త్రవేత్తలందరిదీ అని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. జీఎస్ఎల్వీ-డి5 రాకెట్ జిశాట్ 14వ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగికి తీసుకెళ్లిన అనంతరం రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ప్రయోగం విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విజయంతో 20 సంవత్సరాల కల సాకారమయ్యిందన్నారు.అనుకున్న దిశలో కక్ష్యలో కి రాకెట్ చేరిందన్నారు. తొలి దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ క్రయోజనిక్ ఇంజిన్ వినియోగంలో తాము విజయం సాధించపట్ల గర్వంగా ఉందన్నారు. ఈ దేశీయ ఇంజిన్ తాము అనుకున్నట్లే పనిచేసిందని తెలిపారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్ఎల్వి(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డి5 రాకెట్ సాయంత్రం 4:18 గంటలకు నింగికెగిసింది. ఇది జిశాట్ 14వ ఉపగ్రహాన్ని తీసుకువెళ్లింది. భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగం ఇది. రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లిన తరువాత శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టింది.