నేడు పీఎస్‌ఎల్‌వీ సీ33 కౌంట్‌డౌన్ ప్రారంభం
♦ 28న మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం
♦ ఎంఆర్‌ఆర్ సమావేశంలో నిర్ణయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ33 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 28న మధ్యాహ్నం 12. 50 గంటలకు జరుగుతుందని, మంగళవారం ఉదయం 9.20 కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని మిషన్ సంసిద్ధతా సమావేశం(ఎంఆర్‌ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాల్ లో ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో పీఎస్‌ఎల్‌వీ సీ33, పీఎస్‌ఎల్‌వీ సీ34 గురించి తగు నిర్ణయాలు తీసుకున్నారు.
సోమవారం 12.50 కు లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. దీనిపై ల్యాబ్ (లాం చ్ ఆథరైజేషన్ బోర్డు) చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో కూడా భేటీ జరిగింది. ప్రయోగానికి 51.30 గంటల ముందు అంటే మంగళవారం ఉదయం 9.20 గంట లకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ33 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఆఖరు ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.
జూన్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ34 ప్రయోగం..
పీఎస్‌ఎల్‌వీ సీ34 ప్రయోగాన్ని వాస్తవంగా మే నెలాఖరులో చేపట్టేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం జూన్ మొదటి వారానికి వాయిదావేయాలని ఎఆర్‌ఆర్ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రయోగంలో సరికొత్తగా 22 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.