నేడు పీఎస్‌ఎల్‌వీ సీ31 ప్రయోగం
రెండో లాంచ్‌పాడ్ నుంచి ఉదయం 9.31 నిమిషాలకు ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి బుధవారం ఉదయం 9.31కు పీఎస్‌ఎల్‌వీ సీ31 రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 48 గంటలపాటు సాగే ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని, రెండో దశలో మంగళవారం 42 టన్నుల ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మంగళవారం రాత్రికి హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ ప్రయోగంలో 1,425 కిలోల బరువు కలిగిన ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మంగళవారం షార్‌కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రయోగం గురించి చర్చించారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 33వది కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహం కావడం గమనార్హం.
ప్రయోగం ఇలా జరుగుతుంది..
44.4 మీటర్ల పొడవు, 320 టన్నుల బరువుతో పీఎస్‌ఎల్‌వీ సీ31 బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు రెండో లాంచ్‌పాడ్ నుంచి నింగికి పయనం అవుతుంది. ఈ ప్రయోగాన్ని కోర్‌అలోన్ దశలో 138.2 టన్నులు, ఎక్స్‌ఎల్ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం ద్వారా 110.9 సెకన్లలో మొదటి దశను పూర్తిచేస్తారు. 42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 265 సెకన్లలో రెండో దశను, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 600.6 సెకన్లలో మూడో దశను, 2.5 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 1,123.3 టన్నుల ద్రవ ఇంధనంతో నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం 1,161 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని 20,657 కిలోమీటర్లలో అపోజి(భూమికి దూరంగా) 284 పెరిజీ(భూమికి దగ్గరగా) 19 డిగ్రీల భూబదిలీ కక్షలో ప్రవేశపెడతారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 కిలోమీటర్ల పెరిజీని పెంచుకుంటూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోకి భూస్థిరకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు.
శ్రీవారి ఆలయంలో ఇస్రో శాస్త్రవేత్తల పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఇస్రో అధికారులు పూజలు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)నుంచి బుధవారం పీఎస్‌ఎల్‌వీ-సీ31 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఇందుకోసం సోమవారం కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సంబంధిత ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఇస్రో చేపట్టే ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల ఆలయంలో పూజలు చేయటం సంప్రదాయం.