నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 | Countdown for LVM 3 mission commences | Sakshi
Sakshi News home page

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్-3

Published Thu, Dec 18 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్-3

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్-3

* ఉదయం 9.30 గంటలకు షార్ నుంచి ప్రయోగం

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగాత్మకంగా కొత్త తరం జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. దీనికోసం బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన 24.30 గంటల కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అయితే ప్రయోగ సమయాన్ని ముందుగా నిర్ణయించినట్లు 9 గంటలకు కాకుండా మరో అరగంట పెంచారు.

సాంకేతిక కారణాల వల్ల లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఈ మార్పు చేసింది. బుధవారం రాత్రికి రాకెట్‌లోని హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడంతో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు 2009 నుంచి ఎంతో శ్రమించి రూపొందించిన 42.4 మీటర్ల ఎత్తు, 630 టన్నుల బరువు ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3.. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకుపోనుంది. దీని ద్వారా ‘క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రీ ఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్ (కేర్)’ను ప్రయోగించనున్నారు.

3.1 మీటర్ల వెడల్పు, 2.67 మీటర్ల ఎత్తు ఉన్న కేర్ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను 126 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లి, దాన్ని తిరిగి భూమికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని సముద్రంలో దిగనుంది. ఆ కేర్ మాడ్యూల్‌ను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. రాకెట్‌కు రూ. 140 కోట్లు, క్రూ మాడ్యూల్‌కు రూ. 15 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో 3 వేల కిలోలకు పైబడిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించే విషయాన్ని పరిశీలిస్తారని.. అలాగే అంతరిక్షంలోకి పంపిన వ్యోమగాముల్ని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చే ప్రక్రియ అధ్యయనం చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement