కోహెడ రూరల్ (హుస్నాబాద్) : గంట గంటకూ ఉత్కంఠ.. ఓ వైపు దూసుకొస్తున్న వరద ప్రవాహం.. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటల పాటు చెట్టు కొమ్మలను పట్టుకుని..బిక్కుబిక్కుమంటూ గడిపాడో లారీ డ్రైవర్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రెస్క్యూ టీం అధికారులు కాపాడే ప్రయత్నంలో తాడు తెగి కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోతిమొగ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు ఇసుక లారీ (టీఎస్02–యూబీ1836) లోడ్‌తో వంతెనపై నుంచి వెళ్తోంది. '
మొత్తం 8 లారీల్లో ఐదో లారీ వాగు దాటే క్రమంలో వర ద ఉధృతికి కొట్టుకుపోయింది. క్లీనర్ ధర్మజీ ప్రమాదాన్ని పసిగట్టి లారీ లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్ శంకర్ (35) వరదలో కొట్టుకుపోయి ముళ్ల చెట్టును పట్టుకుని 12 గంటల పాటు సహాయం కోసం నిరీక్షించాడు. క్లీనర్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఎస్‌ఐ రాజ్‌కుమా ర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల సమయంలో మంత్రి హరీశ్‌రావుకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన మంత్రి.. డ్రైవర్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లను ఆదేశించారు.
తాడు తెగడంతో..
శనివారం ఉదయం 11 గంటల సమయం లో ఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్, వరంగల్ నుంచి రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లను రప్పించారు. డ్రైవర్ శంకర్ వద్దకు తాడు సహాయంతో ట్యూబ్‌ను వదిలారు. రబ్బరు ట్యూబ్‌ను పట్టుకుని మధ్య వరకు రాగానే ప్యాంటుకు కంప తట్టుకొని తాడు తెగి నీటి లో గల్లంతయ్యాడు. హెలికాప్టర్‌లో అధికారులు వాగు చుట్టూ గాలించినా ఫలితం లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment