సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలైన అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపే లక్క్ష్యంగా బరిలో నిలిచాయి. అంతేకాకుండా మూడు పార్టీలు ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చుట్టపక్కల సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లాంటి టీఆర్‌ఎస్ కంచుకోటలు ఉండటంతో దుబ్బాకలో తొలినుంచి టీఆర్‌ఎస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఇప్పటి వరకు నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ భిన్నంగా ఉండబోతుందని స్థానిక రాజకీయ విశ్లేషకుల మాట. (ముచ్చటగా మూడోసారి: విజయం దక్కుతుందా?)
గతంలో కాంగ్రెస్ (చెరుకు ముత్యంరెడ్డి) ఇక్కడ బలమైన నేతగా పేరొందినా.. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ స్థానం బీజేపీ ఆక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ నుంచి కంటే బీజేపీ నుంచే తీవ్రమైన పోటీ ఎదురైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ గతంలో ఇదే స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముచ్చటగా మూడోసారి బరిలోకిదిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న రఘునందన్.. ప్రచారంలో ఇరు పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీ తరఫున, రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచారు. స్థానికతతో పాటు, సానుభూతి కూడా తోడవుతుంది భావించిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సుజాతను బరిలోకి దింపారు. (కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం)
సానుభూతి పనికొస్తుందా..?
ఎన్నికల్లో సానుభూతి పనికొస్తుది? అనేది గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోతే రాబోయ్యే ఉప ఎన్నికల్లో వారి కుటుంబంలోనే ఒకరికి సీటును కేటాయిస్తారు. లేకపోతే విపక్షాలు ఒప్పుకుంటే కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ క్రమంలో నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలపగా.. ఆయనపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది. సిట్టింగ్ అభ్యర్థి మరణంతో సానుభూతి కలిసొచ్చిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. రికార్డు మెజార్టీతో కారుపార్టీ విజయం సాధించింది.
సీను రిపీటైతే టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు..
కొంతకాలానికే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అక్కడ కూడా తన భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలబెట్టింది. 2016లో ఉప ఎన్నిక జరిగిన ఈ స్థానానికి అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్‌ఎస్ అధిష్టానం పోటీకి ఆదేశించింది. అప్పటికే మండలిలో సభ్యుడిగా ఉండి.. కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగుతున్న తుమ్మలకు పాలేరు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. దాదాపు 47వేలకు పైగా ఆధిక్యంతో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. సిట్టింగ్ స్థానం అయిన్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి దారుణ పరాజయం మూటగట్టకున్నారు.
ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ ఒక్కచోటైనా సానుభూతి పనికొస్తే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించాలి. కానీ అలా జరుగలేదు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సానుభూతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే అధికార టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు. టీఆర్‌ఎస్ నేతలను సైతం ఇదే వెంటాడుతోంది. అయితే స్థానికంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. దుబ్బాక ప్రజలు సానుభూతికి ఓటేస్తారా లేక, విపక్షాలను ఎన్నుకుంటారా అనేది నవంబర్ 10న తేలనుంది.
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్..
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ నవంబర్: 10
కేసీఆర్‌ను వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?
Comments
Please login to add a commentAdd a comment