దుబ్బాకలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు, కార్యకర్తల కప్పగంతులు ఊపందుకున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంతో పాటు.. ఆయా పార్టీల్లోని అసమ్మతి నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఏ ప్రయత్నాన్ని వదలడం లేదు. పలుకుబడి, ప్రజల్లో మంచి పేరున్న వారిని గుర్తించి మద్దతుగా నిలవాలని వారి అనుచర వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఒక వైపు ముమ్మర ప్రచారం చేస్తూనే మరో వైపు ఇతర పార్టీల నాయకులకు తమ పార్టీ కండువాలు కప్పుతున్నారు. చేర్చుకోవడం, తాయిలాలు ప్రకటిస్తుండటంతో నియోజకవర్గంలోని చోటామోటా నాయకులకు కూడా డిమాండ్ పెరిగింది.
సాక్షి, సిద్దిపేట : ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా 2008లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్‌రావు, 2018 ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చిన్నం రాజ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయతత్రించిన కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి కూడా ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా తొగుట మండలంలోని చిలువేరు రాంరెడ్డి, రవీందర్, ఇతర కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు, దేవేందర్, రాయపొలు మండలంలోని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యాక్షులు భాగన్నగారి బాలలక్ష్మి గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు నియోజకవర్గంలోని పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికార పార్టీలో చేరుతున్నారు. (ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?)
ముత్యంరెడ్డి అనుచరులకు కాంగ్రెస్ ఎర
కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాడర్‌ను పెంచుకునేందుకు ఫ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి సానుభూతి అనుకూలిస్తుందని ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. ముత్యంరెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌లో చేరిన వారు, బీజేపీలో చేరిన ముత్యంరెడ్డి అనుచరులకు కాంగ్రెస్ నాయకులు గాలం వేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ నేరుగా దుబ్బాకకు వచ్చి ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించడంతో నాయకులు ఓటర్ల వేటలో పడ్డారు. ఇప్పటికే దౌల్తాబాద్ మండలం నుంచి గొల్లపల్లి సర్పంచ్ శేఖమ్మ కనకయ్య టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా మిరుదొడ్డి మండలానికి చెందిన బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డిని ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఆయనను తమ పార్టీలో చేర్పించుకునేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్న వార్త నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఇలా కాంగ్రెస్ పార్టీ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా తమ క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా యువతను తమ వైపు తిప్పుకునేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేవైఎస్, కిసాన్ మోర్చ, మహిళా మోర్చ వంటి అనుబంధ సంఘాల కార్యకర్తలతో ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నాయకులను తమ పార్టీలో చేరాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన తొగుట మండలంలోని తుక్కాపూర్ సర్పంచ్ చిక్కుడు చంద్రంను బీజేపీలో చేర్పించుకున్నారు. దుబ్బాక రూరల్ చిట్టాపూర్ ఎంపీటీసీ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఇలా ఒకొక్కరిని తమ పార్టీలలో చేర్చుచుకుంటూ.. బలం పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు.
దుబ్బాకలో 18 నామినేషన్లు దాఖలు
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గురువారం రోజున 18 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్ (శివసేన పార్టీ), జగదీష్ రాజ్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), సునీల్ (ఇండియా ప్రజా బంధు పార్టీ), భాస్కర్ (శ్రమజీవి పార్టీ), ఇండిపెండెంట్లుగా ఉదుత మల్లేశ్ యాదవ్, కంటె సాయన్న, కొట్టాల యాదగిరి, శ్యాంకుమార్, చిన్న ధన్‌రాజ్, రవితేజ, నరేష్ , రాజసాగర్, వేంకటేశం, ప్రతాప్, లక్ష్మన్, మాదవరెడ్డి, పెద్దలింగన్న గారి ప్రసాద్ లు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment