Operation Akarsh
-
కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌ను బీజేపీ వేగవంతం చేసింది. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి,మెదక్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి ,చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు త్వరలో బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. తాజాగా సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొనున్నారు. కాంగ్రెస్ తరఫున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి జయసుధ గెలిచారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలోకి జయసుధను దింపుతారని ప్రచారం. ఇప్పటికే ఈటలతో జయసుధ భేటీ అయిన సంగతి తెలిసిందే. చదవండి: రాజకీయాలు చేయాల్సిన టైం ఇదా కేసీఆర్..? ఎవరికి చెక్ పెట్టేందుకు జయసుధ? ముషీరాబాద్ నుంచి తన అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రయత్నాలు చేస్తుండగా, ముషీరాబాద్ నుంచి తన కుమార్తె విజయలక్ష్మిని బరిలోకి దింపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మణ్, దత్తాత్రేయలకు చెక్ పెట్టేందుకు జయసుధను తెస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. -
Telangana BJP: ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచాలి.. వాళ్లకే సీట్లివ్వండి!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకులున్నారని, ఆయా స్థానాల్లో వారికంటే బలమైనవారు పార్టీలోకి వచ్చే పక్షంలో వారికి సీటు కేటాయించడంపై స్పష్టమైన హామీ ఇవ్వండి..’ అంటూ బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి సూచించింది. మిగిలిన 40 స్థానాల్లోనూ ఇతర పార్టీలకు గట్టి పోటీనిచ్చేలా చూడాలని తెలిపింది. ‘ఆపరేషన్ ఆకర్ష్' స్పీడ్ పెంచాలని ఆదేశించింది. ప్రస్తుతం తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్షాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బయటపడుతున్న అసంతృప్తిని పార్టీకి అనుకూలంగా మలుచుకుంటూ ముందుకెళ్లాలని సూచించింది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పార్టీకి ఇంతకంటే అనుకూల వాతావరణం, అవకాశం మరోసారి రాదని స్పష్టం చేసింది. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, సభ్యులు డీకే అరుణ, గరికపాటి మోహన్‌రావు తదితరులతో జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వేర్వేరుగా సమావేశమయ్యారు. తగిన నేతల భరోసానివ్వండి... ఇతర పార్టీల నుంచి వచ్చేవారిలో బలమైన నేతలకు సీటు ఇచ్చే విషయంపై వారికి విశ్వాసం కల్పించాలని, అయితే పలానా సీటిస్తామని మాత్రం ముందుగానే ప్రకటించలేమని బీజేపీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తమతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల గురించి ఈటల వివరించినట్టు సమాచారం. దాదాపు 15 నుంచి 20 మంది దాకా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్థాయిల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పినట్టు తెలిసింది. అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా, టీపీసీసీలో వివిధ హోదాలు, పదవుల్లో ఉన్నందున ఇప్పటికిప్పుడు బీజేపీలోకి రాలేమని, కొంతకాలం వేచి చూస్తామంటూ కొందరు ముఖ్య నేతలు చెబుతున్నట్టు సమాచారం. కొందరు నేతలు తమకు పలానా ఎంపీ, అసెంబ్లీ సీటు ఖరారు చేయాలంటూ ముందుగానే కండిషన్లు పెడుతున్నారని రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులకు చెప్పారు. గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతోంది రాబోయే రోజుల్లో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతోందని పార్టీ చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం రాత్రి ఓ రిసార్ట్ వద్ద ఈటల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని అన్నారు. చదవండి: 26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ -
తెలంగాణ ఉద్యమంలో పని చేసిన నాయకులకు సీఎం ఫోన్ కాల్
-
మునుగోడులో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
-
Warangal Politics: కారు స్పీడుకు బ్రేకులు పడతాయా?
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సగం సీట్లలో పాగా వేసేందుకు విపక్షాలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్స్ మేమేనంటూ ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. చదవండి: గాల్లోకి మంత్రి కాల్పులు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు పోరాటాల పురిటి గడ్డ వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ గులాబీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగిలినవన్నీ గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరారు. తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏకపక్షంగా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలో ఐదారు అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నట్లు తేలింది. దీంతో గులాబీ పార్టీలో గుబులు, విపక్షాల్లో జోష్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్ఎస్.. బలపడేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ నాయకుల్లో కొందరు జిల్లా అంతటా పర్యటించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన చరిత్ర ఉండటంతో.. మరోసారి ఆ స్థాయిలో ఆ స్థాయిలో సీట్లు సాధించాలని చూస్తున్నారు కమలనాథులు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ.. వారికి కాషాయ తీర్థం ఇచ్చేందుకు తెగ శ్రమిస్తున్నారు. ఆయా నాయకుల హోదాల మేరకు రాష్ట్రస్థాయి నేతలు సైతం టచ్‌లోకి వెళ్తున్నారట. అయితే అనుకున్నంత వేగంగా చేరికలు లేకపోవడంతో బీజేపీ శిబిరాన్ని డైలమాలో పడేస్తోంది. బీజేపీ ఎత్తుగడలు తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు విరుగుడు మంత్రం వేస్తున్నారు. బీజేపీ వాళ్లనే టీఆర్ఎస్లోకి లాగే ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న స్థాయి నేతలకు వల వేస్తే లాభం లేదనుకున్నారో ఏమో.. గతంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో ఫుల్ టైమర్స్‌గా పనిచేసి.. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న కరుడుగట్టిన నేతలకే గురి పెట్టారు. జీవితాంతం బీజేపీలోనే ఉంటారు.. కండువా మార్చబోరని అనుకుంటున్న వారిని లాగితే.. పార్టీ శ్రేణులు డీలా పడతాయనే ఉద్దేశంతో గట్టిగానే గాలం వేస్తున్నారట. ఇలా వరంగల్ అర్బన్ ప్రాంతానికి చెందిన కొందరిని ఆకర్షించారు. వరంగల్ అర్బన్‌లో బలపడాలని చూస్తున్న బీజేపీకి తాజా వలసలు ఇబ్బందే అనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ నగర అధ్యక్షునితో పాటు, ఒక కార్పొరేటర్‌కు గులాబీ కండువా కప్పేశారు. పైగా ఇది అంతం కాదు.. ఆరంభమేనని చెప్పుకొస్తున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ నుంచి అసంతృప్తులు ఎవరూ కమలం శిబిరం వైపు చూడకుండా వ్యూహరచన చేశారు అధికార పార్టీ నేతలు. అయితే బీజేపీ నుంచి ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని కమలనాథులు ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే కారులో ఎక్కువమంది ఎక్కేశారని.. అందులో ఉన్నవారికి ఊపిరి సలపడం లేదని.. త్వరలోనే దిగిపోయేవాళ్లు క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని చెబుతున్నారు. వెళ్లిన దారినే తిరిగొచ్చేస్తారని ధీమాగా ఉన్నారు బీజేపీ నేతలు. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ సభతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ రచ్చబండతో గ్రామస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కృషితో పార్టీ బలం కాస్త పెరుగుతున్నా..దానికి ఆదిలోనే గండికొట్టేలా కమలం, కారు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ బలం కాస్త పెరుగుతున్నట్లనిపిస్తున్నా..గ్రూప్ రాజకీయాలే ఆ పార్టీ కొంపముంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగితే కచ్చితంగా మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ములుగుతో పాటు అభ్యర్థులను బట్టి నర్సంపేట, భూపాలపల్లిలో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సాక్షి కార్టూన్
సాక్షి కార్టూన్ -
‘ఆపరేషన్ ఆకర్ష్’.. తెలంగాణ బీజేపీ నేతలకు కీలక ఆదేశాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ ఆకర్ష్’లో వేగం పెంచాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులను ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలను ఆకర్షించి బీజేపీలో చేర్చుకునే విషయంపై కసరత్తు ముమ్మరం చేయాలని సూచించింది. రాష్ట్ర పార్టీ అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న అధినాయకత్వం ఒకవైపు చేరికలపై రాష్ట్రనేతల వెంటపడుతూనే, చేరికపై ఊగిసలాడుతున్న ఇతర పార్టీల నేతలతో తానే సంప్రదింపులు జరుపుతోంది. కొంతకాలంగా ఎటూ తేల్చకుండా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంప్రదింపులు జరిపారు. జాతీయపార్టీ ముఖ్యనేతల సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్టుగా ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్‌ఛుగ్, ఇతర నాయకులతో వివిధ పార్టీల ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్టుగా చెబుతున్నారు. చేరికలకు అత్యంత ప్రాధాన్యత ఈ నెల 7న రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా నియమితులైన సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన కసరత్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఈటలతోపాటు కమిటీ సభ్యులు డీకే అరుణ, డా.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎ.చంద్రశేఖర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ కూడా ఎవరికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల చేరికలకు సంబంధించి పూర్తిగా నిర్ధారణ అయి, చేరే దాకా ఆ నేతల పేర్లు బయటకు రాకుండా ఉంచాలన్న నాయకత్వం ఆదేశాల నేపథ్యంలో అంతా రహస్య అపరేషన్ సాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్లపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ జిల్లాల్లోని ఒకరిద్దరు ఎంపీలు, కొందరు మాజీమంత్రులు/ఎంపీలు/ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, అయితే ముహూర్తం ఎప్పుడనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదని తెలుస్తోంది. విభిన్న వ్యూహాలతో ముందుకు... ప్రధాన పార్టీల నుంచి ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చేరేందుకు ముందుకొచ్చే కొందరు నేతలు పోటీచేసే నియోజకవర్గం, తన వెంట వచ్చే నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని కండిషన్లు పెడుతున్నట్లు తెలిసింది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ముఖ్య నేతలకు వెన్నుదన్నుగా ఉన్నవారిపైనా, సమాజంపై ప్రభావం చూపే విద్యావంతులు, వైద్యులు, వివిధ రంగాల మేధావులు, వివిధ సామాజికవర్గాల నేతలు, సంఘాల పెద్దలను కూడా పార్టీలోకి ఆకర్షించేందుకు చర్యలు చేపెట్టారు. -
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. వేకువజామున 4 గంటలకు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచినట్టు కనిపిస్తోంది. నేరుగా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూరే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే తాను బస చేస్తున్న హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆయన బయటకు వెళ్లడం సంచలనం రేపుతోంది. మాణిక్యం ఠాగూర్ ఎక్కడికి వెళ్లారు? ఆయన వెంట ఎవరెవరు ఉన్నారని ఇప్పుడు పార్టీలోని సీనియర్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వేకువజామున 4 గంటల ప్రాంతంలో మాణిక్యం ఠాగూర్ ఒక్కరే బయటకు వచ్చి ఓ కారులో వెళ్లినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ కారులో పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కనుగోలు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరు కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, చేరికల కమిటీ చీఫ్, మాజీ మంత్రి జానారెడ్డిని కలిసినట్టు చర్చించుకుంటున్నారు. ఈ నలుగురు కలిసి ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారన్నది మాత్రం బయటకు పొక్కనీయ లేదు. ఏ పార్టీ నేతను కలిశారు? రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మాణిక్యం ఠాగూర్, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, సునీల్ కనుగోలు కలిసి అధికార టీఆర్ఎస్కు చెందిన నేతల ఇంటికి వెళ్లి ఉంటారా? ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వారిని టార్గెట్ చేసి తీసుకువచ్చేలా ఆ పార్టీ నేతతో చర్చించారా అన్నది తేలలేదు. అయితే మరికొందరు మాత్రం బీజేపీలోని ఓ సీనియర్ నేత ఇంటికి వెళ్లి ఉంటారంటున్నారు. చాలారోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు వెళ్లి ఉంటారని అంటున్నారు. అంతా రహస్యంగా... సాధారణంగా మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలన్నీ పార్టీ ప్రొటోకాల్ విభాగం చూసుకుంటుంది. ఆయన ఎవరిని కలవాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ప్రొటోకాల్ విభాగం నేతలు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆదివారం తెల్లవారు జామున 4 నుంచి 11 గంటల మధ్య మాణిక్యం ఠాగూర్ ప్రొటోకాల్ విభాగానికి అందుబాటులో లేరని సమాచారం. ఆ ఏడు గంటలు ఎక్కడికి పోయారన్న విషయం ఆసక్తి రేపుతోంది. ఇంత రహస్యంగా ఏ స్థాయి నేతను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. -
వలసలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి... ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. వీలైనంత త్వరగా తెలంగాణ అంతటా బలోపేతం కావాలి. మిషన్– 2023 లక్ష్యంగా దూసుకెళ్లాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలనాథులు శరవేగంగా వ్యూహరచన చేస్తున్నారు. పకడ్బందీగా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ‘సర్జికల్ స్ట్రైక్’ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఇప్పుడు... ‘సాఫ్రాన్ స్ట్రైక్’కు పదును పెడుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోని అసంతృప్త, కీలక నేతలను కాషాయదళంలోకి తీసుకురావడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఎవరెవరు వస్తారు, ఎవరైతే మనకు లాభం... అనే కోణంలో పార్టీల వారీగా... పక్కాగా జాబితాలను సిద్ధం చేస్తోంది. పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యులకు అప్పగించి... అధినాయకత్వంతో భవిష్యత్తుకు భరోసా ఇప్పిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను నడిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు 2023లో వచ్చినా, అంతకుముందే వచ్చినా.. సర్వసన్నద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టిపోటీనిచ్చిన స్థానాలు, ప్రజలు బీజేపీపై ఆదరణ చూపిన ప్రాంతాల్లో మొదట పట్టు సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. వాటితో పాటు దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టేలా కార్యాచరణ అమలులో పెట్టనుంది. పక్కాగా చేరికల వ్యూహం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. వారిలో మాజీ మంత్రి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, వీరేందర్‌గౌడ్, బొడిగె శోభ తదితరులున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌లను పార్టీలోకి తీసుకొచ్చింది. తాజాగా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా... టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఆపరేషన్ సాఫ్రాన్ స్ట్రైక్‌కు శ్రీకారం చుట్టింది. బడానేతలకు గురిపెడితే... అవతలిపక్షాన్ని దెబ్బకొట్టడంతో పాటు బీజేపీవైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణాలకూ ప్రాధాన్యం ఇస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తూ వలసల వ్యూహానికి పదును పెట్టింది. వరుస ఓటములతో డీలాపడ్డ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే 20 మందికిపైగా నేతల జాబితాను రూపొందించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి కూడా అసంతృప్తుల వలసలు ఉంటాయని, అలా వచ్చే అవకాశమున్న వారితో జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారనే ధీమాతో ఉంది. వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరికొందరు ముఖ్యనేతలకు అప్పగించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో బీజేపీ ముఖ్యనేత ఒకరు ఇప్పటికే చర్చలు జరిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్ ఇటీవల స్వయంగా భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుటుంబంతో బీజేపీ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ముందుగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్ హైదరాబాద్ సరిహద్దుల్లోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలపై బీజేపీ మొదట ఫోకస్ పెట్టింది. 1996లో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో అప్పటి ఎంఐఎం చీఫ్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో వెంకయ్యనాయుడు ఓడిపోయినా... గట్టిపోటీనిచ్చారు. అప్పుడు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న చేవెళ్ల, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు లభించాయి. అందుకే అక్కడి నుంచి తమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు పూనుంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో టచ్‌లో ఉంది. మహమూబ్నగర్లోనూ పార్టీ కేడర్ బలంగా ఉందని విశ్వసిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డిది ఈ జిల్లాయే. దీనికితోడు జిల్లాలో పార్టీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని డీకే అరుణకు ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. వీరిద్దరి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించి పని చేసేలా బీజేపీ వ్యూహం రూపొందిస్తోంది. వరంగల్ కార్పొరేషన్లో పట్టు కోసం.. త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి మంచి పట్టున్న స్థానాలు ఉన్నాయి. దేశంలో బీజేపీకి రెండే ఎంపీ స్థానాలు ఉన్న 1984లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు పరకాల నియోజకవర్గం నుంచి 1985లోనే వి.జయపాల్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో మార్తినేని ధర్మారావు హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేయర్‌గా డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు బీజేపీ నుంచే పని చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామీణ, పట్టణప్రాంతాల్లో బీజేపీకి మంచి కేడర్ ఉంది. అందుకే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై గురి పెట్టింది. అక్కడ పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికను పునాదిగా చేసుకోవాలని భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో ముగ్గురు ఎంపీలపై భారం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్ధిపేట్ మున్సిపల్ ఎన్నికల తరువాత మొత్తంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని భావిస్తోంది. అందుకు ఇప్పుడు కార్యాచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ పైనే ఉమ్మడి జిల్లాలో పార్టీ విస్తరణ బాధ్యత పెట్టారు. నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వంటి నేతలు ఉన్నారు. ఆదివాలాబాద్లో ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. కాబట్టి ఆయా జిల్లాల్లో పార్టీ విస్తరణకు కోసం పెద్ద ఎత్తున చేరికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలే టార్గెట్‌గా ముందుకు వెళుతోంది. మెదక్ జిల్లాపైనా కసరత్తు చేస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయం... పార్టీలోకి వలసలను పెంచుతుందనే ధీమాలో ఉంది. ఇక చివరగా ఖమ్మం, నల్గొండ జిల్లాలపై దృష్టి సారించేలా చర్యలు చేపడుతోంది. క్యాడర్ ఉంది... లీడర్లు కావాలి... రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. చాలాచోట్ల గ్రామీణ ప్రాంతా ల్లోనూ పార్టీకి కేడర్ ఉందని, సైలెంట్ ఓటర్లు ఉన్నారని... బలమైన నాయకత్వం అవసరమని భావి స్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీలోకి వచ్చే నేతల జాబితాలను సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో బలంగా ఉన్న పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది. ఆ తరువాత 2019లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక దుబ్బాకలో సంచలన విజయం సాధించిన బీజేపీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి రాణించింది. గ్రేటర్లో పట్టు నిలిచిందని భావిస్తున్న కమలనాథులు... రాష్ట్రవ్యాప్తంగా విస్తరణపై దృష్టి సారించారు. -
ఆపరేషన్ ఆకర్ష్: రంగు మారుతున్న రాజకీయం
దుబ్బాకలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు, కార్యకర్తల కప్పగంతులు ఊపందుకున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంతో పాటు.. ఆయా పార్టీల్లోని అసమ్మతి నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఏ ప్రయత్నాన్ని వదలడం లేదు. పలుకుబడి, ప్రజల్లో మంచి పేరున్న వారిని గుర్తించి మద్దతుగా నిలవాలని వారి అనుచర వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఒక వైపు ముమ్మర ప్రచారం చేస్తూనే మరో వైపు ఇతర పార్టీల నాయకులకు తమ పార్టీ కండువాలు కప్పుతున్నారు. చేర్చుకోవడం, తాయిలాలు ప్రకటిస్తుండటంతో నియోజకవర్గంలోని చోటామోటా నాయకులకు కూడా డిమాండ్ పెరిగింది. సాక్షి, సిద్దిపేట : ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా 2008లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్‌రావు, 2018 ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చిన్నం రాజ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఇటీవల టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయతత్రించిన కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి కూడా ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా తొగుట మండలంలోని చిలువేరు రాంరెడ్డి, రవీందర్, ఇతర కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు, దేవేందర్, రాయపొలు మండలంలోని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యాక్షులు భాగన్నగారి బాలలక్ష్మి గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు నియోజకవర్గంలోని పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికార పార్టీలో చేరుతున్నారు. (ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?) ముత్యంరెడ్డి అనుచరులకు కాంగ్రెస్ ఎర కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాడర్‌ను పెంచుకునేందుకు ఫ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి సానుభూతి అనుకూలిస్తుందని ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. ముత్యంరెడ్డితోపాటు టీఆర్ఎస్లో చేరిన వారు, బీజేపీలో చేరిన ముత్యంరెడ్డి అనుచరులకు కాంగ్రెస్ నాయకులు గాలం వేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ నేరుగా దుబ్బాకకు వచ్చి ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించడంతో నాయకులు ఓటర్ల వేటలో పడ్డారు. ఇప్పటికే దౌల్తాబాద్ మండలం నుంచి గొల్లపల్లి సర్పంచ్ శేఖమ్మ కనకయ్య టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా మిరుదొడ్డి మండలానికి చెందిన బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డిని ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఆయనను తమ పార్టీలో చేర్పించుకునేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్న వార్త నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఇలా కాంగ్రెస్ పార్టీ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా తమ క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా యువతను తమ వైపు తిప్పుకునేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేవైఎస్, కిసాన్ మోర్చ, మహిళా మోర్చ వంటి అనుబంధ సంఘాల కార్యకర్తలతో ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు టీఆర్ఎస్లోని అసమ్మతి నాయకులను తమ పార్టీలో చేరాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీకి చెందిన తొగుట మండలంలోని తుక్కాపూర్ సర్పంచ్ చిక్కుడు చంద్రంను బీజేపీలో చేర్పించుకున్నారు. దుబ్బాక రూరల్ చిట్టాపూర్ ఎంపీటీసీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఇలా ఒకొక్కరిని తమ పార్టీలలో చేర్చుచుకుంటూ.. బలం పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. దుబ్బాకలో 18 నామినేషన్లు దాఖలు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గురువారం రోజున 18 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్ (శివసేన పార్టీ), జగదీష్ రాజ్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), సునీల్ (ఇండియా ప్రజా బంధు పార్టీ), భాస్కర్ (శ్రమజీవి పార్టీ), ఇండిపెండెంట్లుగా ఉదుత మల్లేశ్ యాదవ్, కంటె సాయన్న, కొట్టాల యాదగిరి, శ్యాంకుమార్, చిన్న ధన్‌రాజ్, రవితేజ, నరేష్ , రాజసాగర్, వేంకటేశం, ప్రతాప్, లక్ష్మన్, మాదవరెడ్డి, పెద్దలింగన్న గారి ప్రసాద్ లు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. -
కమలదళం వలస బలం!
-
టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరేనా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బలోపేతమయ్యే దిశగా భారతీయ జనతాపార్టీ పావులు కదుపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార టీఆర్ఎస్కు దీటుగా నిలవాలనే లక్ష్యంతో చక్రం తిప్పుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో దక్షిణ భారతదేశంలో తెలంగాణను గేట్వేగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అండగా నిలిచిన సామాజిక వర్గానికి చెందిన నేతలకు గాలం వేసే పనిని ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లను బీజేపీలో చేర్చుకోవాలనే యోచనతో కమలనాథులు చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని అరడజను మంది ప్రముఖ నేతలను పార్టీలో చేర్చుకుని తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావులకు అప్పగించిన అధిష్టానం.. రాష్ట్రంలో స్థానిక నేతలను సమన్వయం చేసే బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ‘ముందస్తు’కు ముందు నుంచే... తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని బీజేపీ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందే ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కె.అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బాబూమోహన్, బొడిగె శోభ, ఆదిలాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు తదితరులను పార్టీలోకి చేర్చుకుంది. వీరిలో కొందరికి టికెట్లు ఇచ్చి పోటీ చేయించింది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలను తీసుకుంటే పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతో పాటు పలువురు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలతో రాంమాధవ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలకు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో జరగనున్న పరిణామాలను బట్టి ఈ నెలాఖరులోగా కొందరు కీలక కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చే స్పందనను బట్టి పార్టీలో కూడా వారికి తగిన ప్రాధాన్యమివ్వాలని, బీజేపీలోకి వస్తే అటు పార్టీపరంగా, ఇటు తమ భవిష్యత్తు పరంగా గ్యారంటీ ఉంటుందనే భావనను కలిగించాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరేనా? తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చాడా సురేశ్‌రెడ్డి వంటి నేతలు బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. పెద్దిరెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు టీడీపీలో మిగిలిపోయిన నేతలను గుర్తించి వారందరినీ బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన లెంకల దీపక్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన కొత్తకోట దయాకర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి బలం లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం కోల్పోవడంతో ఇదే అదనుగా టీడీపీని ఖాళీ చేసే పనిలో కాషాయపార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘టీడీపీలో ఉన్న నేతలకు కనుచూపు మేరలో రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. వారు ఆ పార్టీలో ఎన్ని రోజులున్నా అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, చంద్రబాబుకు దగ్గరగా ఉండే రావుల చంద్రశేఖర్‌రెడ్డి మినహా ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరేమో’ అని ఓ బీజేపీ ముఖ్య నేత వ్యాఖ్యానించడం చూస్తే టీడీపీని ఖాళీ చేయడమే కమలనాథుల లక్ష్యమని అర్థమవుతోంది. టార్గెట్.. 2023 దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారం దక్కుతున్నప్పటికీ దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకోలేకపోతోంది. కర్ణాటకలో కూడా అధికారం దోబూచులాటగానే మారింది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోని సామాజిక, రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో కమలనాథులకు రాష్ట్రంపై నమ్మకం పెరిగింది. అందులో భాగంగానే గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్ అమిత్‌షా తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు మిగిలిన పార్టీల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు రెండు మూడేళ్ల నుంచే తమ కార్యాచరణ ప్రారంభించాలని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చేలా చేయాలనే వ్యూహంతో ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో 2023 ఎన్నికల నాటికి బలీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు.. ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది. -
బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమలనాథుల ఆపరేషన్ ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆర్ఎస్ఎస్ మాజీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు అధిష్టానం అప్పగించింది. ఇందులో భాగంగా రాంమాధవ్ హైదరాబాద్ వచ్చి పార్క్ హయత్‌లో మకాం వేశారు. మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాంమాధవ్‌తో భేటీ అయిన వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మోహన్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతలు రాంమాధవ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. 2023నే లక్ష్యంగా... కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో పాగ వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా 4 లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకున్న తెలంగాణలో పార్టీని విస్తరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేయడంతోపాటు వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాంమాధవ్‌కు అప్పగించారు. దీనిలో భాగంగానే రాంమాధవ్ ప్రాథమికంగా కొందరు నేతలను ఆకర్శించే వ్యూహంతో బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఆయనతో తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు సమావేశం అయ్యేలా స్థానిక నాయకత్వం ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత రాంమాధవ్ పలు పార్టీల నేతలను కలిశారు. వీరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, టీజేఎస్ నేతలు ఉన్నట్లు తెలిసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో 2023 కల్లా రాష్ట్రంలో కనీసం సగం కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే వ్యూహంతో రాంమాధవ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బుధవారం పలువురి నేతలను కలసిన ఆయన గురువారం కూడా హైదరాబాద్‌లోనే ఉండి మరికొందరిని కలువనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాంమాధవ్‌ను కలసిన నేతలంతా దాదాపు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే బీజేపీలో పలువురు నేతల చేరిక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఒక్కరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాంమాధవ్‌తో టచ్‌లోకి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ ఎంపీలు, టీపీసీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. రాంమాధవ్ నేతృత్వంలో ఎవరెవరు బీజేపీలో చేరతారనేది ఒకటెండ్రు రోజుల్లో తేలనుంది. రాంమాధవ్ వ్యూహం ఫలిస్తే.. 2020 చివరినాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు చెబతున్నారు. -
‘చే’జారిన మరో ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొదలైన ఈ ఆపరేషన్ లోక్‌సభ ఎన్నికల్లోగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసేలా టీఆర్ఎస్ వ్యూహం రచిం చింది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్).. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. వారంలోపే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్) రెండ్రోజుల్లో అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆదివారం లింగయ్య చేరిక కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో నకిరేకల్‌లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వేముల వీరేశంతో చిరుమర్తి లింగయ్య శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ‘అన్నా పార్టీలో చేరుతున్నాను. కలిసి పని చేద్దాం. సహకరించాలన్నా’అని కోరారు. నకిరేకల్‌లోని కాంగ్రెస్ శ్రేణులతోనూ సైతం లింగయ్య ఇదే అంశంపై చర్చించారు. తాజా పరిణామాలతో టీఆర్ఎస్లో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 12న జరగనుంది. అప్పటిలోపు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరతారని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తదుపరి చేరికలు ఉంటాయంటున్నారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ శ్రేణులు, నేతల స్థైర్యాన్ని దెబ్బతీసేలా టీఆర్ఎస్ వ్యూహం అమలు చేయాలని నిర్ణయించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్‌సభ సెగ్మెంట్ల వారీ సన్నాహక సమావేశాలు ముగిసేలోపు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం ముగిసిన మరుసటి రోజే ఆ సెగ్మెంట్ పరిధిలోని నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య టీఆర్ఎస్లో చేరిక ఖాయమైంది. మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలోనూ టీఆర్ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. శాసనసభ కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్–మజ్లిస్ కలిపి ఈ ఎన్నికల్లో పోటీకి దిగాయి. టీఆర్ఎస్ తరుపున నలుగురు, ఎంఐఎం నుంచి ఒక్కరు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలిచింది. మిత్రపక్షంగా పోటీ చేసిన టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. రెండు పార్టీలు కలిపి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఒక స్థానం గెలుచుకోవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ తమ తరఫున గుడూరు నారాయణ రెడ్డిని బరిలోకి దించింది. ఆ వెంటనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారం క్రితమే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ కూటమి బలం 18కి తగ్గింది. అయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం అధికార పార్టీలో చేరడం ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. మజ్లిస్ 7 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలపనున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం టీఆర్ఎస్, మజ్లిస్ ఎమ్మెల్యేల సంఖ్య 102కు పెరిగింది. రెండు పార్టీలు కలిపి ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
కాంగ్రెస్‌కు ఝలక్.. టీఆర్ఎస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునే దిశగా టీఆర్ఎస్ దూకుడు పెంచింది. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్‡్షకు తెరలేపింది. ఐదు ఎమ్మెల్సీ సీట్లు, 16 లోక్‌సభ స్థానాలు దక్కించుకునే ద్విముఖ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక) అధికార పార్టీలో చేరడం ఖాయమై పోయింది. టీఆర్ఎస్లో చేరికపై వీరు అధికారిక ప్రకటన కూడా చేశారు. కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ ఆదివారం గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్తోనే తమ ప్రయాణం సాగుతుందని వీరు చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామని కూడా వెల్లడించారు. రేగా, ఆత్రం బాటలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలలోపు కనీసం 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్నాయి. అటు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి) శనివారం మధ్యాహ్నం కేసీఆర్‌ను కలిశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో అయోమయం! శనివారం నాటి పరిణామాలతో కాంగ్రెస్ షాక్‌కు గురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన ఈ ఇద్దరు ఒక్కరోజులోనే పార్టీ మారడంతో ఆ పార్టీ నాయకత్వంలో నైరాశ్యం నెలకొంది. అటు, శనివారం రాత్రి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్) సహా పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని సమాచారం. దీంతో.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోని వలసలు భారీగానే ఉన్నాయనే చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్ శాసనసభపక్షం మొత్తం టీఆర్ఎస్లో విలీనమైనా ఆశ్చర్యపోవద్దని అధికార పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు. ఐదు ఎమ్మెల్సీలు ఖాయం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజా మార్పులతో శాసనసభ కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ కూటమి ఏకపక్ష విజయం ఖాయమైపోయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో టీఆర్ఎస్కు 91మంది, మిత్రపక్షం మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే కలిపి అధికార కూటమి బలం 101కి చేరనుంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ఆ పార్టీలో ఆశలు సన్నగిల్లాయి. అందుకే టీఆర్ఎస్లోకి: రేగా, ఆత్రం రాష్ట్రంతోపాటు తమ జిల్లాలు, నియోజకవర్గాలు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫునన పోటీ చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్లో చేరడంపై స్పష్టతనిస్తూ.. రేగా కా>ంతరావు, ఆత్రం సక్కు శనివారం ఓ లేఖ విడుదల చేశారు. ‘ఇటీవలే మేం సీఎం కేసీఆర్‌ను కలిశాం. ఎస్టీలు, ముఖ్యంగా ఆదివాసీల సమస్యలను వారి దృష్టికి తెచ్చాం. పోడు భూముల సమస్యలను, ఇప్పటికే గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే అంశం, అధికారుల వేధింపులు, ఆదివాసీల ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతోపాటు ఇతర అంశాలను కేసీఆర్‌తో చర్చించాం. ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారులను వెంటబెట్టుకుని తానే ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. ఓటాన్ అకౌంట్‌పై బడ్జెట్‌పై చర్చ సందర్భంలోనూ అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలో ఆదివాసీలు, ఇతర గిరిజనుల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే న్యాయనిపుణులతోనూ సంద్రిస్తాం. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ తరుఫున పోటీచేస్తాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయి. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాలతోపాటు పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో దాదాపు 70 వేల ఎకరాలు సాగునీరు ఇతర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని శాసించే స్థాయిలో కేసీఆర్‌కు బలం చేకూరాలి. అందుకోసమే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనకు అండగా ఉండాలని మేం నిర్ణయించుకున్నాం’అని లేఖలో వీరిద్దరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి.. టీడీఎల్పీ విలీనం దిశగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అధికారాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభలో పరిపూర్ణ మెజారిటీ దిశగా వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో అనుసరించిన వ్యూహాన్నే శాసనసభలోనూ అనుసరించి విపక్ష సభ్యులను అధికారికంగా విలీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. నూతన అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే ఈ ‘ఆపరేషన్’ను పూర్తి చేసి కాంగ్రెస్, టీడీపీలకు భారీ షాక్ ఇచ్చేలా వ్యూహాలకు పదును పెట్టాలనేది పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని సమాచారం. తద్వారా లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీలను రాజకీయంగా మరింత దెబ్బతీయడంతోపాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు షురూ... అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకునేలా టీఆర్ఎస్ వ్యూహాలు ఇప్పటికే మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం... గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నట్లుగానే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట)లను ఒకేసారి పార్టీలో చేర్చుకొని ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో ఈ దిశగా మొదలైన సంప్రదింపులు కీలక దశకు చేరుకున్నాయని తెలిసింది. అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే టీడీఎల్పీ విలీనం దిశగా నిర్ణయాలు జరగనున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఎమ్మెల్యేల ప్రమాణానికి ముందే తెలంగాణలో టీడీపీ ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోనుంది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే లక్ష్యంగా... కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేయడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. ఇదే తరహాలో అసెంబ్లీలోనూ జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్యా రాములు నాయక్ (వైరా) టీఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది తమతో కలిసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు చెబుతున్నారు. వారిలో ఎనిమిది మంది ఏ క్షణమైనా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీతో కలసి పని చేసేందుకు నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీలోనూ శాసనమండలి పరిస్థితులే పునరావృతం కానున్నాయి. ఏమిటీ గులాబీ వ్యూహం..? జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ అసెంబ్లీలో పరిపూర్ణ మెజారిటీ కోసం వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకుగాను 16 స్థానాల్లో (మిత్రపక్షమైన మజ్లిస్ పోటీ చేసే ఒక సీటు మినహా) గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచి గణనీయ స్థాయిలో లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్... ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో ఒకరకమైన నైరాశ్యం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల వరకు కుదురుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదేశాలతో లోక్‌సభ ఎన్నికలకు టీపీసీసీ సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహంతో కాంగ్రెస్‌ను మరోసారి దెబ్బ కొట్టాలని, ఎమ్మెల్యేల చేరికలు సైతం నలుగురైదుగురితో సరిపెట్టకుండా కాంగ్రెస్ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో టీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది. మండలిలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా రద్దు శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రద్దయింది. కాంగ్రెస్ శాసనమండలిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీ హోదాను రద్దు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ శాసనమండలిపక్షం టీఆర్ఎస్లో విలీనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ... వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తన పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ ఆమోదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
టీఆర్ఎస్లో ఆసక్తికరమైన పరిణామాలు
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ పలు మార్లు చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఓ అంచనాకు వచ్చేలా ఫలితాలు ఉపయోగపడ్డాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నా ఏ కారణాల చేతనో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఈ అసంతృప్తి మరింతగా ఉందని సమాచారం. ప్రభుత్వ పనితీరు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజాభిప్రాయం ఎంతో సానుకూలంగా ఉన్నా, కొందరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అలా లేదంటున్నారు. ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా ఈ మేరకు పార్టీ అధినేతకు సమాచారం కూడా చేరిందని చెబుతున్నారు. జంప్ జిలానీలుగా ముద్రపడిన ఇతర పార్టీలనుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో కష్టకాలమే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణల పేర జరిగిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం ఏకంగా 88కి పెరిగింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. -
ప్రతిపక్షమే వద్దనుకుంటే...!
సందర్భం ఆత్మగౌరవ పాలనంటే కేవలం ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలతోటే పాలన సాగడం కాదు. పార్టీ, ప్రభుత్వం టోకున వ్యక్తి చుట్టూ తిరగడం, ప్రతిపక్షమే వద్దనుకోవడం ప్రజాస్వామ్య మూలాలకే ప్రమాదకరం. సుదీర్ఘపోరాటం, త్యాగాల నేపథ్యంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2014 జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడింది. 14 ఏండ్లుగా ఉద్య మంలో కొనసాగిన టీఆర్ ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు. అయితే పార్టీ పెట్టిన నాడు ప్రముఖ పాత్ర వహించిన వారిలో ఎక్కువ మంది తర్వాత కనుమరుగైనారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన వారు కూడ దూరమైనారు. చివరిదాకా కేసీఆర్‌తో అంటిపెట్టుకొని ఉన్నవారికి కూడా తగిన గుర్తింపు రాలేదనే అసంతృప్తులున్నాయి. మొత్తంమీద కేసీఆర్ దీర్ఘకాలిక వ్యూహంతో నడు స్తున్నట్లుంది. ఇక్కడ ఏ పార్టీ ఉండ కూడదనే దురభిప్రాయం కనబడుతు న్నది. అందుకనే తెలంగాణ ఉద్య మంలో లేని అనేక మందికి మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్యెల్యే, ఎమ్మెల్సీ లాంటి ప్రధాన పదవులిచ్చారు. అంతే కాకుండా వివిధ రాజకీయ పార్టీల గుర్తుల మీద ఎన్నికలలో గెలి చిన దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అనేకమంది ఎమ్మెల్సీలను, ముగ్గురు ఎంపీలను పార్టీలో చేర్చుకొని ఫిరా యింపులను బాగా ప్రోత్సహించారు. వారిని టీఆర్ఎస్లో కలుపుకున్నారు. పార్టీ పూర్తిగా తన కనుసన్నలలో సాగేలాగా పూర్తిస్థాయి ఆధిపత్యం సాధిం చగలిగారు. ఆయన చెప్పిందే వేదం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు లెక్కలేదు. తెలంగాణ తెచ్చుకున్నది ఒక్క వ్యక్తికి పట్టం కట్టబెట్టడానికి కాదు. అనేక సంవత్సరాలుగా అణచి వేతకు గురయిన తెలంగాణలో సామాజిక న్యాయం, మానవాభివృద్ధి జరగాలని, అందుకే మా నీళ్ళు, మా ఉద్యోగాలు మాకే దక్కాలని, సహజ వనరులను కాపాడు కోవాలనీ, ఆత్మగౌరవ పాలన సాగాలనే డిమాండ్లే ఉద్యమ ఆకాంక్షలయ్యాయి. కానీ అందుకు పూర్తిగా భిన్న మైన పాలన సాగడంతో వివిధ రాజకీయ పార్టీలు, మేధా వులు, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జేఏసీ లాంటి ఉద్యమ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆత్మగౌరవ పాలనంటే కేవలం ముఖ్యమంత్రి ఇష్టా యిష్టాల మీద పాలన సాగడమా? రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు ప్రాతినిధ్యం చేయడానికి అర్హులు కారా? ఆఖరుకు వికలాంగులను కూడా కల వకపోతే ముఖ్యమంత్రి క్యాంపు దగ్గరనే ఆత్మహత్యకు పాల్పడే స్థితికి రావడం దేనికి సంకేతమిస్తున్నది? టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూడా అపుడపుడు మనసు నొచ్చుకుంటు న్నారు. పదవులలో ఉండాలనుకుంటే భరించాల్సిందేననే ఆవేదనలు వారిలో లేకపోలేదు. దీంతో వ్యక్తి చుట్టూ్ట పార్టీ భ్రమిస్తుందనే చర్చ సాగడం సహజం. అధికార యంత్రాంగమంతా కేసీఆర్ కనుసన్నలలోనే సాగుతున్న దనే భావనలు నెలకొన్నాయి. పోలీసు వ్యవస్థ పూర్తిగా టీఆర్ఎస్ ప్రతినిధులకు ప్రాముఖ్యతనిస్తున్నది. ప్రతి పక్షాలు ఉద్యమబాట పట్టడం తప్ప వేరే మార్గం లేదు. 2014 వరకు టీఆర్ఎస్ ప్రతిపక్షమే, అప్పుడు వారు పత్రికా ప్రకటనలు, విమర్శలను నెమరు వేసుకుంటే మంచిది. ప్రతిపక్షాలు విమర్శిస్తే భరించే పరిస్థితి లేక పోవడం, అసహనానికి గురి అవుతూ, తన స్థాయిమరచి దిగజారి ప్రతిపక్షాలపై విరుచుకుపడటం అప్రజాస్వామ్య మనిపించుకుంటుంది. పథకాల అమలులో లోపాలను ఎత్తిచూపితే శత్రువుల్లాగా చూస్తున్నారు. ప్రతిపక్షాలను గౌరవించని, గుర్తించని వ్యవస్థను ఏమనుకోవాలి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు విధిగా ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీకి విధి విధానా లుంటాయి. వాటిని తప్పుపట్టే అధి కారం ఎవ్వరికీ లేదు. ప్రభుత్వంలో తప్పులు దొర్లితే వేలెత్తి చూపడం, ప్రజలకు జరుగుతున్న అన్యాయా లను ప్రభుత్వం దృష్టికి తేవడం ప్రతి పక్షాల ప్రధాన బాధ్యత. ప్రతిపక్షాలకు సీట్లే రావనే ఆలో చనే అహంభావానికి అద్దం పడు తున్నది. ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభు త్వానికి భజన చేయాలనే ఆలోచన ఉంటే మంచిది కాదు. అలా అయితే ఇక పార్టీలెందుకు? తెలంగాణ ప్రభుత్వ ఆలోచనల మూలంగా రాజ కీయ వ్యవస్థ కుప్పకూలిపోతున్నది. ప్రతిపక్షాలను అణచివేయాలనుకోవడమంటే ప్రజాస్వామ్య మూలసూత్రాలకు తిలోదకాలివ్వడమే అవు తుంది. చాలా కాలం తర్వాత ఆగస్టు 20న జిల్లాల పున ర్విభజన పైన సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన మాట్లాడిన తీరు ప్రతిపక్షాలను ఆకట్టుకున్నది. మనం అనే భావనను వ్యక్త పరిచారు. 15 రోజులకొకసారి, రెండుసార్లు అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తానని, అందరి అభిప్రాయాల ననుసరించి జిల్లాల పునర్విభజన ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎందుకు అఖిలపక్షాన్ని పిలువ లేద న్నది ప్రశ్న. ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉండక పోతే ఏమనుకోవాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజకీయపార్టీలతో, జేఏసీ తదితర సామాజిక సంస్థలతో మమేకమైన కేసీఆర్ ఈనాడు వారందరినీ దూరంగా ఉంచడంలో ఆంతర్యమేమిటి? వారంతా మీకేమైనా శత్రువులనుకుంటున్నారా? అందరూ కలిసి తెలంగాణ సమగ్రాభివృద్ధికి, సకల ప్రజల బ్రతుకులు బాగుచేయ డమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. అందుకని అందరి సలహాలు తీసుకొని ఏకాభిప్రాయానికి రండి! తెలంగాణలో దారిద్య్రరేఖకు దిగువనున్న బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులలో వెలుగు నింపే లక్ష్యంగా ఆలోచనలుండటం సబబుగా ఉంటుంది. వ్యాసకర్త చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మొబైల్ : 94909 52301 -
టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ మంత్రం!
♦ పాలేరు ఉప ఎన్నిక ముందు చేరికల తంత్రం ♦ మంత్రిని గెలిపించుకునేందుకు విపక్షాలపై మానసిక యుద్ధం ♦ నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను మళ్లీ ప్రయోగించింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు ఈ మంత్ర దండాన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ను బలహీన పరచడం కోసం చేరికల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగానే ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆత్మరక్షణ ధోరణి వల్లే టీఆర్ఎస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటోందని పేర్కొంటున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వివిధ పార్టీల మద్దతు కోరడంలో నిగమ్నమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీల నుంచి మద్దతు హామీని పొందింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతు, రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి వల్ల ఆయన కుటుంబానికి అనుకూలంగా వీచే సానుభూతి పవనాలు తమ అవకాశానికి గండికొట్టే ముప్పు ఉందన్న ముందు చూపుతోనే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ను పార్టీలోకి గులాబీ దళం చేర్చుకుంటోందని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి కొద్ది నెలలుగా పువ్వాడ అజయ్ టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ముగియగానే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అయితే అప్పటికే పాలేరు నియోజకవర్గం ఖాళీ కావడం, ఉప ఎన్నిక ఖాయం కావడంతో ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగానే టీఆర్ఎస్ ఆయన్ను చేర్చుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఈనెల 27న ఖమ్మంలో జరగనున్న టీఆర్ఎస్ 15వ ప్లీనరీ వేదికపైనే పువ్వాడ అజయ్ టీఆర్ఎస్లో చేరాల్సి ఉన్నా వివిధ కారణాలను పరిగణనలోకి తీసుకుని రెండు రోజులు ముందుగానే గులాబీ కండువాలు కప్పనున్నారని తెలుస్తోంది. ఆయనతోపాటు ఖమ్మం నియోజకవర్గానికి చెందిన మరికొందరు నాయకులు, ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన కొందరు కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరనున్నారని తెలుస్తోంది. మానసికంగా పైచేయి కోసమే... పాలేరులో ఏకగ్రీవానికి సహకరించాలని ఒకవైపు కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తుండగానే హడావుడిగా టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ప్రకటించింది. తద్వారా ఎమ్మెల్యేలు చనిపోయిన నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని మరోసారి పక్కన పెట్టింది. వివిధ సమీకరణలను అంచనా వేసిన టీఆర్ఎస్ కాంగ్రెస్‌ను పరోక్షంగా దెబ్బకొట్టి మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోనూ అక్కడి ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ కుటుంబానికి ఏకగ్రీవంగా వదిలేయలేదు. కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని కోరినా పట్టించుకోని టీఆర్ఎస్ పోటీ పడి ఆ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు పాలేరు విషయంలోనూ టీఆర్ఎస్ అదే ఫార్ములాను వినియోగిస్తోంది. -
దిగజారిన ‘ఆకర్ష్’ రాజకీయం
♦ వార్డు మెంబర్ వచ్చినా ఓకే... ♦ కార్పొరేటర్లు.. కౌన్సిలర్లయినా పరవాలేదు.. ♦ ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు.. ♦ అందరికీ ఓపెన్ ఆఫర్లు.. ♦ లీజులు, లెసైన్సులు, డబ్బులు ♦ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కోసం ఓ కమిటీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘దిగజారడం మొదలుపెడితే ఇది నా తొలిమెట్టు... చివరి మెట్టు ఎలా ఉంటుందో ఊహించుకో..’ ఓ పాపులర్ సినిమాలో విలన్ వ్యాఖ్య ఇది.. హామీలను అమలు చేయకపోగా అవినీతి కుంభకోణాలలో కూరుకుపోవడం.. ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుండడం.. ప్రతిష్ట పూర్తిగా మసకబారడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగ్గా అలానే వ్యవహరిస్తున్నారు. కమిటీ వేసి మరీ ఆఫర్లు ప్రకటిస్తూ.. ప్రలోభాలకు గురిచేస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజధానిలో భూ ములిస్తామని ప్రకటిస్తున్నారంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని ఒకసారి... మురికివాడల్లో నివసించేవారికి మురికి ఆలోచనలే వస్తాయని మరోసారి.. చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో చేసినవేనని విశ్లేషకులంటున్నారు. ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముట్టడంతో ఆయన బైటపడే మార్గాలను ఆన్వేషిస్తూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ఆసరాగా చేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ అనేక రకాల ప్రచారాలకు దిగుతుండడం ఆ కోవలోనిదేనంటున్నారు. అందుకోసమే ఆకర్ష్ కమిటీ.. చంద్రబాబు ఆకర్ష్ రాజకీయాలు ఎంతకు దిగజారాయంటే వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లను కూడా వదలడం లేదు. గుంటూరు జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన కొద్దిమంది సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లను నయానో భయానో తెలుగుదేశంలోకి ఆకర్షించి అదేదో గొప్ప విషయమన్నట్లు అనుకూల చానళ్లు, పత్రికలలో ప్రచారం చేయిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ స్థాయి వారినైనా ఆకర్షించాలని మూడు నెలల కిందటే అయిదుగురితో కూడిన ‘ఆకర్ష్ కమిటీ’ని నియమించి కుమారుని ద్వారా నిస్సిగ్గుగా జిల్లాల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ఇద్దరు, పార్టీ రాష్ట్ర బాధ్యుడు, ఎమ్మెల్యే.... ఈ ఆకర్ష్ కమిటీలో పనిచేస్తున్నారని సమాచారం. ప్రజాప్రతినిధులు కాదుకదా మునిసిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు చివరకు కార్యకర్తలైనా సరే తీసుకురండని వీరు స్థానిక నాయకులను పురమాయిస్తున్నారని సమాచారం. ఆఫర్లు.. ప్రలోభాలు... రాష్ర్టంలో 22 నెలలుగా అనేక అవినీతి కుంభకోణాలలో ఆర్జించిన సొమ్మును ఆపరేషన్ ఆకర్ష్ కోసం విరివిగా వాడాలని తెలుగుదేశం అధినేత భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీలోకి ఆకర్షించే నాయకుల స్థాయిని బట్టి వారికి ఆఫర్లను ఎర వేస్తున్నారని తెలుస్తోంది. స్థాయిని బట్టి మంత్రి పదవులు, కోట్ల రూపాయలు నింపిన సూటుకేసులు, గనుల లీజులు, కాంట్రాక్టులు, కేసుల ఉపసంహరణ తదితర ప్రలోభాలు చూపుతున్నారనేది వినికిడి. ప్రతిపక్ష పార్టీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం నాయకులు ఫోన్లలో సంప్రదిస్తుండడం, ఆఫర్లను ఎరవేస్తుండడం చూస్తుంటే వారు ఏ స్థాయికి దిగజారారో తెలుస్తోందని పరిశీలకులంటున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలకు రాజధానిలో భూములను ఆఫర్‌గా చూపుతున్నారని సమాచారం. పెండింగ్‌లో ఉన్న లెసైన్సులు మంజూరు చేయిస్తామని, ఎంత అడిగితే అంత ఇప్పిస్తామని, కేసులుంటే ఎత్తివేయిస్తామని తెలుగుదేశం నాయకులు ఓపెన్ ఆఫర్లిస్తున్నట్లు వినిపిస్తోంది. -
ఆకర్ష్
ఇతర పార్టీల నేతలకు టీఆర్ఎస్ గాలం ఎన్నికల షెడ్యూలు విడుదలతో ప్రయత్నాలు ముమ్మరం మంత్రులు, ఇన్చార్జులు,ఎమ్మెల్యేలు ఇదే పనిలో బిజీ సిటీబ్యూరో:బల్దియా ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలోఅధికార టీఆర్ఎస్ పార్టీ నగరంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలలోని ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయక గణానికి తాయిలాలతో ‘ఆకర్షించి’... తమ పార్టీలో చేర్చుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల గెలుపు బాధ్యతలను తలకెత్తుకున్న టీఆర్ఎస్ ఇన్చార్జులు ఇతర పార్టీల నేతలను సంప్రదిస్తున్నారు. కార్పొరేటర్ టిక్కెట్లు... నామినేటెడ్ పదవులు... అభివృద్ధి పనుల్లో అవకాశాలు వంటి తాయిలాలతో తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రధాన నగరంలోకంటే శివార్లలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు జోరుగా సాగుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నేతలు గజ్జెల సుష్మ మధుసూదన్‌రెడ్డి, సామ రమణారెడ్డి నేడో రేపో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిల హామీ మేరకు వారు పార్టీ మారుతున్నట్లు సమాచారం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్ నేతలకు అధికార పార్టీ గులాబీ తీర్థం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవలే కాంగ్రెస్ నేతలు చౌడ శ్రీనివాసరావు, సోమేష్ యాదవ్‌లను పార్టీలో చేర్చుకుంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్‌కు చెక్ పెట్టేందుకు కమలనాథులేలక్ష్యంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమీప బంధువు ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రధాన సూత్రధారిగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఒకరిద్దరు బీజేపీ నేతలను టీఆర్ఎస్ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కూకట్పల్లి నియోజకవర్గంలోనూ టీడీపీ, బీజేపీ ద్వితీయశ్రేణి నేతలకు టీఆర్ఎస్ నేతలు గాలం వేస్తున్నట్లు తెలిసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు సమాచారం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీకి చుక్కెదురైనట్టు తెలిసింది. వార్డుల రిజర్వేషన్లు తమకు అనుకూలంగా లేకపోవడంతో కాంగ్రెస్, టీడీపీల ముఖ్య నేతలు గులాబీ గూటికి చేరేందుకు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. సనత్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ క్యాడర్‌ను సమూలంగా టీఆర్ఎస్లో కలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుండడం గమనార్హం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంత్రి పద్మారావు ఈ విషయంలో జోరు మరింతగా పెంచడం విశేషం. మహేశ్వరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురిని టీఆర్ఎస్లో చేర్పించేందుకు చొరవ చూపారు. ఈ నియోజకవర్గంలో కొందరు యువకులు బీజేపీలో చేరేందుకు ఇటీవల ప్రాధాన్యమిస్తుండడం విశేషం. స్వచ్ఛందమేనట ఆపరేషన్ ఆకర్ష్‌ను అధికార పార్టీ మం త్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఖండిస్తుండడం గమనార్హం. గత 18 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లు చూసి ఇతర పార్టీల నేతలు వెల్లువలా టీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని చెబుతున్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయని అభివృద్ధిని తాము చేసి చూపామని... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ రచించిన ప్రణాళికలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని సెలవిస్తున్నారు. నగరానికి గోదావరి జలాల తరలింపు.. భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మల్టీలెవల్ ఫ్లైఓవర్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం టీఆర్ఎస్ ఘనతేనని అంటున్నారు. గెలిచే పార్టీనే ఆదరిద్దామన్న ‘ఫీల్‌గుడ్’ భావనే నాయకులను గులాబీ పార్టీ బాట పట్టిస్తోందని చెబుతుండడం గమనార్హం. -
'టీఆర్ఎస్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త మంత్రిత్వ శాఖ'
నల్గొండ : అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆ శాఖ బాధ్యతలు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి నిర్వహిస్తున్నారని తెలిపారు. శుక్రవారం నల్గొండలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్‌పై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చేశామని చెబుతున్న టీఆర్ఎస్... ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలను కలుపుకుని పోతామని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ధనిక విధానాలు విడనాడాలి
హైదరాబాద్: ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధనికవర్గ అనుకూల విధానాలను మార్చుకుని వాగ్దానాల అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలని, ప్రజల ఆకాంక్షలను గుర్తెరగాలని సీపీఎం తెలంగాణ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 9 నెలల పాలనలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజల కలలు కల్లలవుతున్నాయని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సీపీఎం రాష్ర్ట మహాసభ ప్రతినిధుల సభ రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరాలంటే ప్రజోపయోగ విధానాలు అవసరమని అభిప్రాయపడింది. ఉపాధి అవకాశాలు పెంచేందుకు, సామాజిక న్యాయం, రైతులు, కూలీలు, కార్మికులు, వృత్తిదారులు ఇలా వివిధవర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజల పక్షం వహిం చే ప్రత్యామ్నాయం అవసరమంది. వామపక్షాలు, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడే సంస్థలు, ప్రజాసంఘాలు, వ్యక్తులు, మేధావులు ఐక్యంగా కృషిచేస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టంచేసింది. తెలంగాణలో ఇలాంటి ప్రత్యామ్నాయం కోసం కలసి రావాలని సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు పిలుపునిచ్చాయి. కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి బలపరచగా మహాసభ ఆమోదించింది. తారాస్థాయిలో ‘ఆపరేషన్ ఆకర్ష్’: తమ్మినేని గత కాంగ్రెస్, టీడీపీల మాదిరిగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేట్, పెత్తందార్ల ప్రయోజనాల పరిరక్షణకే పనిచేస్తున్నదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములుతో కలసి మహాసభ తీర్మానాన్ని ఆయన మీడియాకు విడుదలచేశారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ భారీ వాగ్దానాలు చేశారని, వాటి అమల్లో మాత్రం విఫలమయ్యారని తమ్మినేని ఆరోపించారు. విపక్షాల ఎమ్మెల్యేలు, నేతలను ఆకర్షించి అధికార పార్టీలో చేర్చుకునే ‘ఆపరేషన్ ఆకర్ష్’ కేసీఆర్ హయాం లో తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధుల కోసం బీజేపీ వద్ద సాగిలపడడం, ఓట్లకోసం ఎంఐ ఎంతో అంటకాగే ప్రయత్నం చేయడం వంటి ప్రమాదకర ధోరణులను కేసీఆర్ విడనాడాలని సూచించారు. తెలంగాణకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని స్థితి లో ఇక్కడి టీడీపీ నేతలున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యామ్నాయ విధానాలతో పరిష్కారం చూపగలిగేవి వామపక్షాలు మాత్రమేనన్నారు. సచివాలయం తరలింపులో కార్పొరేట్ హస్తం సచివాలయాన్ని మార్చడం వెనక కార్పొరేట్ హస్తంఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల ఆశలను ప్రభుత్వం వమ్ముచేసిందని విమర్శించారు. రాష్ట్ర సర్కార్‌పై మెతకవైఖరేల? రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపట్ల గత కొంతకాలంగా వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పార్టీ ఇంకా మెతకవైఖరిని అవలంబిస్తుండటంపై పలువురు సీపీఎం నాయకులు పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. మహాసభల్లో భాగంగా తమ్మినేని ప్రవేశపెట్టిన రాజకీయ నిర్మాణ నివేదికపై చర్చల్లో భాగంగా కొందరు నేతలు ఈ విషయంలో నాయకత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ఐదు నెలల్లో 10మంది ఎమ్మెల్యేలు చేరిక
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ఆపరేషన్ ఆకర్ష్‌ను పూర్తి చేయాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే గత అయిదు నెల్లలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాంతో అసెంబ్లీలో ఆపార్టీ బలం 73కి పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీఆర్ఎస్ బలం 63 ఉండగా, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్సీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు ఆపార్టీలో చేరారు. బుధవారం తెలంగాణ టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ....టీఆర్ఎస్లో చేరగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా త్వరలోనే కారెక్కబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాదయ్య, రెడ్యా నాయక్ ఈరోజు కేసీఆర్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. కాగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి మరిన్ని చేరికలు ఉండవచ్చనే ఊహాగానాలు వినిస్తున్నాయి. -
రండి బాబు రండి!