'ఆకర్షణ'లో పడి ...
కారు పార్టీ దెబ్బకు అటు సైకిల్ ఇటు హస్తం పార్టీలు మటాష్ అయిపోతున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ అక్కడితో ఆగిపోకుండా... పార్టీని మరింత దృఢ పరిచేందుకు పావులు కదుపుతుంది. అందుకోసం 'ఆపరేషన్ ఆకార్ష్' పేరిట శ్రీకారం చుట్టింది. తమ కారులో ఎంత మంది ఎక్కిన పుష్పక విమానంలో లాగా మరొకరికి చోటు ఉంటుందంటూ అన్ని పార్టీల నాయకులను పిలిచి మరీ ఎక్కించుకుంటూ ముందుకెళుతోంది. దాంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే వలస నేతలను పెద్ద ఎత్తున ఆకర్షించింది.
ఒక్కొక్క జిల్లాను లక్ష్యంగా చేసుకుంటూ కారు దూసుకుపోతుంది. ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి ముందుగా గులాబీ దండులోకి చేరిపోయారు. అదే జిల్లాలోని ముంథోల్ నుంచి ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా నేనేమన్న తక్కువ తిన్నానా అంటూ ఆ ఇద్దరి ఎమ్మెల్యేల బాటలోనే వెళ్లి డోరు తీసుకుని మరీ కారు ఎక్కెశారు. దాంతో ఆదిలాబాద్ జిల్లాలో కారు దెబ్బకు హస్తం, ఏనుగు పార్టీలు కుదేలయ్యాయి. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఇప్పటికే గులాబీ కండవా కప్పుకున్నారు. ఆ దెబ్బతో తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ సంఖ్య మరింత దిగజారింది.
ఇప్పుడు కారు ఖమ్మం జిల్లాలో పాగా వేసేందుకు సిద్దమైంది. టీడీపీ అంటే తుమ్మల... తుమ్మల అంటే టీడీపీ అనే విధంగా పాతుకుపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కారు ఎక్కించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. దాంతో ఆయన్ని సెప్టెంబర్ మొదటివారంలో కారు ముందు సీట్లో కూర్చోబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కారు తర్వాత ఏ జిల్లాను లక్ష్యంగా చేసుకుని దూసుకుపోతుందో చూడాలి.