ఆత్రం సక్కు, రేగా కాంతారావు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునే దిశగా టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్‡్షకు తెరలేపింది. ఐదు ఎమ్మెల్సీ సీట్లు, 16 లోక్‌సభ స్థానాలు దక్కించుకునే ద్విముఖ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక) అధికార పార్టీలో చేరడం ఖాయమై పోయింది. టీఆర్‌ఎస్‌లో చేరికపై వీరు అధికారిక ప్రకటన కూడా చేశారు. కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ ఆదివారం గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌తోనే తమ ప్రయాణం సాగుతుందని వీరు చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తామని కూడా వెల్లడించారు. రేగా, ఆత్రం బాటలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని టీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలలోపు కనీసం 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్నాయి. అటు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి) శనివారం మధ్యాహ్నం కేసీఆర్‌ను కలిశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్‌లో అయోమయం!
శనివారం నాటి పరిణామాలతో కాంగ్రెస్ షాక్‌కు గురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన ఈ ఇద్దరు ఒక్కరోజులోనే పార్టీ మారడంతో ఆ పార్టీ నాయకత్వంలో నైరాశ్యం నెలకొంది. అటు, శనివారం రాత్రి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్) సహా పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని సమాచారం. దీంతో.. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోని వలసలు భారీగానే ఉన్నాయనే చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్ శాసనసభపక్షం మొత్తం టీఆర్‌ఎస్‌లో విలీనమైనా ఆశ్చర్యపోవద్దని అధికార పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు.
ఐదు ఎమ్మెల్సీలు ఖాయం
టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజా మార్పులతో శాసనసభ కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్, మజ్లిస్ కూటమి ఏకపక్ష విజయం ఖాయమైపోయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 91మంది, మిత్రపక్షం మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే కలిపి అధికార కూటమి బలం 101కి చేరనుంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ఆ పార్టీలో ఆశలు సన్నగిల్లాయి.
అందుకే టీఆర్‌ఎస్‌లోకి: రేగా, ఆత్రం
రాష్ట్రంతోపాటు తమ జిల్లాలు, నియోజకవర్గాలు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్ తరఫునన పోటీ చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరడంపై స్పష్టతనిస్తూ.. రేగా కా>ంతరావు, ఆత్రం సక్కు శనివారం ఓ లేఖ విడుదల చేశారు. ‘ఇటీవలే మేం సీఎం కేసీఆర్‌ను కలిశాం. ఎస్టీలు, ముఖ్యంగా ఆదివాసీల సమస్యలను వారి దృష్టికి తెచ్చాం. పోడు భూముల సమస్యలను, ఇప్పటికే గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే అంశం, అధికారుల వేధింపులు, ఆదివాసీల ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతోపాటు ఇతర అంశాలను కేసీఆర్‌తో చర్చించాం. ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు.
అధికారులను వెంటబెట్టుకుని తానే ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. ఓటాన్ అకౌంట్‌పై బడ్జెట్‌పై చర్చ సందర్భంలోనూ అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలో ఆదివాసీలు, ఇతర గిరిజనుల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే న్యాయనిపుణులతోనూ సంద్రిస్తాం. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్ తరుఫున పోటీచేస్తాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయి. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాలతోపాటు పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో దాదాపు 70 వేల ఎకరాలు సాగునీరు ఇతర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని శాసించే స్థాయిలో కేసీఆర్‌కు బలం చేకూరాలి. అందుకోసమే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనకు అండగా ఉండాలని మేం నిర్ణయించుకున్నాం’అని లేఖలో వీరిద్దరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment