సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ పలు మార్లు చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఓ అంచనాకు వచ్చేలా ఫలితాలు ఉపయోగపడ్డాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నా ఏ కారణాల చేతనో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఈ అసంతృప్తి మరింతగా ఉందని సమాచారం.
ప్రభుత్వ పనితీరు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజాభిప్రాయం ఎంతో సానుకూలంగా ఉన్నా, కొందరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అలా లేదంటున్నారు. ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా ఈ మేరకు పార్టీ అధినేతకు సమాచారం కూడా చేరిందని చెబుతున్నారు. జంప్ జిలానీలుగా ముద్రపడిన ఇతర పార్టీలనుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో కష్టకాలమే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 63 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణల పేర జరిగిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం ఏకంగా 88కి పెరిగింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు.
Comments
Please login to add a commentAdd a comment