బీజేపీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ షురూ | BJP Starts Operation Akarsh In Telangana | Sakshi
Sakshi News home page

బీజేపీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ షురూ

Published Thu, Jun 13 2019 2:01 AM | Last Updated on Thu, Jun 13 2019 12:21 PM

BJP Starts Operation Akarsh In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమలనాథుల ఆపరేషన్‌ ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు అధిష్టానం అప్పగించింది. ఇందులో భాగంగా రాంమాధవ్‌ హైదరాబాద్‌ వచ్చి పార్క్‌ హయత్‌లో మకాం వేశారు. మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాంమాధవ్‌తో భేటీ అయిన వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మోహన్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతలు రాంమాధవ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. 

2023నే లక్ష్యంగా... 
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో పాగ వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా 4 లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకున్న తెలంగాణలో పార్టీని విస్తరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేయడంతోపాటు వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాంమాధవ్‌కు అప్పగించారు. దీనిలో భాగంగానే రాంమాధవ్‌ ప్రాథమికంగా కొందరు నేతలను ఆకర్శించే వ్యూహంతో బుధవారం హైదరాబాద్‌ వచ్చారు. ఆయనతో తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు సమావేశం అయ్యేలా స్థానిక నాయకత్వం ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత రాంమాధవ్‌ పలు పార్టీల నేతలను కలిశారు. వీరిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, టీజేఎస్‌ నేతలు ఉన్నట్లు తెలిసింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో 2023 కల్లా రాష్ట్రంలో కనీసం సగం కంటే ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకునే వ్యూహంతో రాంమాధవ్‌ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బుధవారం పలువురి నేతలను కలసిన ఆయన గురువారం కూడా హైదరాబాద్‌లోనే ఉండి మరికొందరిని కలువనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాంమాధవ్‌ను కలసిన నేతలంతా దాదాపు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే బీజేపీలో పలువురు నేతల చేరిక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ఒక్కరిద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు కూడా రాంమాధవ్‌తో టచ్‌లోకి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ ఎంపీలు, టీపీసీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. రాంమాధవ్‌ నేతృత్వంలో ఎవరెవరు బీజేపీలో చేరతారనేది ఒకటెండ్రు రోజుల్లో తేలనుంది. రాంమాధవ్‌ వ్యూహం ఫలిస్తే.. 2020 చివరినాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు చెబతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement