సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచినట్టు కనిపిస్తోంది. నేరుగా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూరే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే తాను బస చేస్తున్న హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆయన బయటకు వెళ్లడం సంచలనం రేపుతోంది. మాణిక్యం ఠాగూర్ ఎక్కడికి వెళ్లారు? ఆయన వెంట ఎవరెవరు ఉన్నారని ఇప్పుడు పార్టీలోని సీనియర్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వేకువజామున 4 గంటల ప్రాంతంలో మాణిక్యం ఠాగూర్ ఒక్కరే బయటకు వచ్చి ఓ కారులో వెళ్లినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ కారులో పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కనుగోలు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరు కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, చేరికల కమిటీ చీఫ్, మాజీ మంత్రి జానారెడ్డిని కలిసినట్టు చర్చించుకుంటున్నారు. ఈ నలుగురు కలిసి ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారన్నది మాత్రం బయటకు పొక్కనీయ లేదు.
ఏ పార్టీ నేతను కలిశారు?
రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మాణిక్యం ఠాగూర్, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, సునీల్ కనుగోలు కలిసి అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నేతల ఇంటికి వెళ్లి ఉంటారా? ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వారిని టార్గెట్ చేసి తీసుకువచ్చేలా ఆ పార్టీ నేతతో చర్చించారా అన్నది తేలలేదు. అయితే మరికొందరు మాత్రం బీజేపీలోని ఓ సీనియర్ నేత ఇంటికి వెళ్లి ఉంటారంటున్నారు. చాలారోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు వెళ్లి ఉంటారని
అంటున్నారు.
అంతా రహస్యంగా...
సాధారణంగా మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలన్నీ పార్టీ ప్రొటోకాల్ విభాగం చూసుకుంటుంది. ఆయన ఎవరిని కలవాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ప్రొటోకాల్ విభాగం నేతలు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆదివారం తెల్లవారు జామున 4 నుంచి 11 గంటల మధ్య మాణిక్యం ఠాగూర్ ప్రొటోకాల్ విభాగానికి అందుబాటులో లేరని సమాచారం. ఆ ఏడు గంటలు ఎక్కడికి పోయారన్న విషయం ఆసక్తి రేపుతోంది. ఇంత రహస్యంగా ఏ స్థాయి నేతను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment