సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బలోపేతమయ్యే దిశగా భారతీయ జనతాపార్టీ పావులు కదుపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా నిలవాలనే లక్ష్యంతో చక్రం తిప్పుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో దక్షిణ భారతదేశంలో తెలంగాణను గేట్‌వేగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అండగా నిలిచిన సామాజిక వర్గానికి చెందిన నేతలకు గాలం వేసే పనిని ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లను బీజేపీలో చేర్చుకోవాలనే యోచనతో కమలనాథులు చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని అరడజను మంది ప్రముఖ నేతలను పార్టీలో చేర్చుకుని తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావులకు అప్పగించిన అధిష్టానం.. రాష్ట్రంలో స్థానిక నేతలను సమన్వయం చేసే బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు అప్పగించారనే చర్చ జరుగుతోంది.
‘ముందస్తు’కు ముందు నుంచే...
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని బీజేపీ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందే ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కె.అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బాబూమోహన్, బొడిగె శోభ, ఆదిలాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు తదితరులను పార్టీలోకి చేర్చుకుంది. వీరిలో కొందరికి టికెట్లు ఇచ్చి పోటీ చేయించింది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలను తీసుకుంటే పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతో పాటు పలువురు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలతో రాంమాధవ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలకు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో జరగనున్న పరిణామాలను బట్టి ఈ నెలాఖరులోగా కొందరు కీలక కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చే స్పందనను బట్టి పార్టీలో కూడా వారికి తగిన ప్రాధాన్యమివ్వాలని, బీజేపీలోకి వస్తే అటు పార్టీపరంగా, ఇటు తమ భవిష్యత్తు పరంగా గ్యారంటీ ఉంటుందనే భావనను కలిగించాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం.
టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరేనా?
తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చాడా సురేశ్‌రెడ్డి వంటి నేతలు బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. పెద్దిరెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు టీడీపీలో మిగిలిపోయిన నేతలను గుర్తించి వారందరినీ బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన లెంకల దీపక్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన కొత్తకోట దయాకర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి బలం లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం కోల్పోవడంతో ఇదే అదనుగా టీడీపీని ఖాళీ చేసే పనిలో కాషాయపార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘టీడీపీలో ఉన్న నేతలకు కనుచూపు మేరలో రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. వారు ఆ పార్టీలో ఎన్ని రోజులున్నా అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, చంద్రబాబుకు దగ్గరగా ఉండే రావుల చంద్రశేఖర్‌రెడ్డి మినహా ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరేమో’ అని ఓ బీజేపీ ముఖ్య నేత వ్యాఖ్యానించడం చూస్తే టీడీపీని ఖాళీ చేయడమే కమలనాథుల లక్ష్యమని అర్థమవుతోంది.
టార్గెట్.. 2023
దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారం దక్కుతున్నప్పటికీ దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకోలేకపోతోంది. కర్ణాటకలో కూడా అధికారం దోబూచులాటగానే మారింది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోని సామాజిక, రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో కమలనాథులకు రాష్ట్రంపై నమ్మకం పెరిగింది. అందులో భాగంగానే గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్ అమిత్‌షా తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు మిగిలిన పార్టీల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు రెండు మూడేళ్ల నుంచే తమ కార్యాచరణ ప్రారంభించాలని, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చేలా చేయాలనే వ్యూహంతో ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో 2023 ఎన్నికల నాటికి బలీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు.. ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది.
కాంగ్రెస్ టు కమలం
Published Fri, Jun 14 2019 2:36 AM | Last Updated on Fri, Jun 14 2019 8:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment