
దిగజారిన ‘ఆకర్ష్’ రాజకీయం
♦ వార్డు మెంబర్ వచ్చినా ఓకే...
♦ కార్పొరేటర్లు.. కౌన్సిలర్లయినా పరవాలేదు..
♦ ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు..
♦ అందరికీ ఓపెన్ ఆఫర్లు..
♦ లీజులు, లెసైన్సులు, డబ్బులు
♦ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కోసం ఓ కమిటీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
‘దిగజారడం మొదలుపెడితే ఇది నా తొలిమెట్టు... చివరి మెట్టు ఎలా ఉంటుందో ఊహించుకో..’
ఓ పాపులర్ సినిమాలో విలన్ వ్యాఖ్య ఇది..
హామీలను అమలు చేయకపోగా అవినీతి కుంభకోణాలలో కూరుకుపోవడం.. ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుండడం.. ప్రతిష్ట పూర్తిగా మసకబారడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగ్గా అలానే వ్యవహరిస్తున్నారు. కమిటీ వేసి మరీ ఆఫర్లు ప్రకటిస్తూ.. ప్రలోభాలకు గురిచేస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజధానిలో భూ ములిస్తామని ప్రకటిస్తున్నారంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని ఒకసారి... మురికివాడల్లో నివసించేవారికి మురికి ఆలోచనలే వస్తాయని మరోసారి.. చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ఫ్రస్ట్రేషన్‌లో చేసినవేనని విశ్లేషకులంటున్నారు. ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముట్టడంతో ఆయన బైటపడే మార్గాలను ఆన్వేషిస్తూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ఆసరాగా చేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ అనేక రకాల ప్రచారాలకు దిగుతుండడం ఆ కోవలోనిదేనంటున్నారు.
అందుకోసమే ఆకర్ష్ కమిటీ..
చంద్రబాబు ఆకర్ష్ రాజకీయాలు ఎంతకు దిగజారాయంటే వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లను కూడా వదలడం లేదు. గుంటూరు జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన కొద్దిమంది సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లను నయానో భయానో తెలుగుదేశంలోకి ఆకర్షించి అదేదో గొప్ప విషయమన్నట్లు అనుకూల చానళ్లు, పత్రికలలో ప్రచారం చేయిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ స్థాయి వారినైనా ఆకర్షించాలని మూడు నెలల కిందటే అయిదుగురితో కూడిన ‘ఆకర్ష్ కమిటీ’ని నియమించి కుమారుని ద్వారా నిస్సిగ్గుగా జిల్లాల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ఇద్దరు, పార్టీ రాష్ట్ర బాధ్యుడు, ఎమ్మెల్యే.... ఈ ఆకర్ష్ కమిటీలో పనిచేస్తున్నారని సమాచారం. ప్రజాప్రతినిధులు కాదుకదా మునిసిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు చివరకు కార్యకర్తలైనా సరే తీసుకురండని వీరు స్థానిక నాయకులను పురమాయిస్తున్నారని సమాచారం.
ఆఫర్లు.. ప్రలోభాలు...
రాష్ర్టంలో 22 నెలలుగా అనేక అవినీతి కుంభకోణాలలో ఆర్జించిన సొమ్మును ఆపరేషన్ ఆకర్ష్ కోసం విరివిగా వాడాలని తెలుగుదేశం అధినేత భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీలోకి ఆకర్షించే నాయకుల స్థాయిని బట్టి వారికి ఆఫర్లను ఎర వేస్తున్నారని తెలుస్తోంది. స్థాయిని బట్టి మంత్రి పదవులు, కోట్ల రూపాయలు నింపిన సూటుకేసులు, గనుల లీజులు, కాంట్రాక్టులు, కేసుల ఉపసంహరణ తదితర ప్రలోభాలు చూపుతున్నారనేది వినికిడి. ప్రతిపక్ష పార్టీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం నాయకులు ఫోన్లలో సంప్రదిస్తుండడం, ఆఫర్లను ఎరవేస్తుండడం చూస్తుంటే వారు ఏ స్థాయికి దిగజారారో తెలుస్తోందని పరిశీలకులంటున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలకు రాజధానిలో భూములను ఆఫర్‌గా చూపుతున్నారని సమాచారం. పెండింగ్‌లో ఉన్న లెసైన్సులు మంజూరు చేయిస్తామని, ఎంత అడిగితే అంత ఇప్పిస్తామని, కేసులుంటే ఎత్తివేయిస్తామని తెలుగుదేశం నాయకులు ఓపెన్ ఆఫర్లిస్తున్నట్లు వినిపిస్తోంది.