
ఆకర్ష్
ఇతర పార్టీల నేతలకు టీఆర్‌ఎస్ గాలం
ఎన్నికల షెడ్యూలు విడుదలతో ప్రయత్నాలు ముమ్మరం
మంత్రులు, ఇన్‌చార్జులు,ఎమ్మెల్యేలు ఇదే పనిలో బిజీ
సిటీబ్యూరో:బల్దియా ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలోఅధికార టీఆర్‌ఎస్ పార్టీ నగరంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలలోని ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయక గణానికి తాయిలాలతో ‘ఆకర్షించి’... తమ పార్టీలో చేర్చుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల గెలుపు బాధ్యతలను తలకెత్తుకున్న టీఆర్‌ఎస్ ఇన్‌చార్జులు ఇతర పార్టీల నేతలను సంప్రదిస్తున్నారు. కార్పొరేటర్ టిక్కెట్లు... నామినేటెడ్ పదవులు... అభివృద్ధి పనుల్లో అవకాశాలు వంటి తాయిలాలతో తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రధాన నగరంలోకంటే శివార్లలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు జోరుగా సాగుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నేతలు గజ్జెల సుష్మ మధుసూదన్‌రెడ్డి, సామ రమణారెడ్డి నేడో రేపో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిల హామీ మేరకు వారు పార్టీ మారుతున్నట్లు సమాచారం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్ నేతలకు అధికార పార్టీ గులాబీ తీర్థం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవలే కాంగ్రెస్ నేతలు చౌడ శ్రీనివాసరావు, సోమేష్ యాదవ్‌లను పార్టీలో చేర్చుకుంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్‌కు చెక్ పెట్టేందుకు కమలనాథులేలక్ష్యంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమీప బంధువు ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రధాన సూత్రధారిగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఒకరిద్దరు బీజేపీ నేతలను టీఆర్‌ఎస్ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కూకట్‌పల్లి నియోజకవర్గంలోనూ టీడీపీ, బీజేపీ ద్వితీయశ్రేణి నేతలకు టీఆర్‌ఎస్ నేతలు గాలం వేస్తున్నట్లు తెలిసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు సమాచారం.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీకి చుక్కెదురైనట్టు తెలిసింది. వార్డుల రిజర్వేషన్లు తమకు అనుకూలంగా లేకపోవడంతో కాంగ్రెస్, టీడీపీల ముఖ్య నేతలు గులాబీ గూటికి చేరేందుకు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. సనత్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ క్యాడర్‌ను సమూలంగా టీఆర్‌ఎస్‌లో కలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుండడం గమనార్హం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంత్రి పద్మారావు ఈ విషయంలో జోరు మరింతగా పెంచడం విశేషం. మహేశ్వరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురిని టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు చొరవ చూపారు. ఈ నియోజకవర్గంలో కొందరు యువకులు బీజేపీలో చేరేందుకు ఇటీవల ప్రాధాన్యమిస్తుండడం విశేషం.
స్వచ్ఛందమేనట
ఆపరేషన్ ఆకర్ష్‌ను అధికార పార్టీ మం త్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఖండిస్తుండడం గమనార్హం. గత 18 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లు చూసి ఇతర పార్టీల నేతలు వెల్లువలా టీఆర్‌ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని చెబుతున్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయని అభివృద్ధిని తాము చేసి చూపామని... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ రచించిన ప్రణాళికలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని సెలవిస్తున్నారు. నగరానికి గోదావరి జలాల తరలింపు.. భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మల్టీలెవల్ ఫ్లైఓవర్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం టీఆర్‌ఎస్ ఘనతేనని అంటున్నారు. గెలిచే పార్టీనే ఆదరిద్దామన్న ‘ఫీల్‌గుడ్’ భావనే నాయకులను గులాబీ పార్టీ బాట పట్టిస్తోందని చెబుతుండడం గమనార్హం.