‘చే’జారిన మరో ఎమ్మెల్యే!  | Chirumarthi Lingaiah Joined In TRS | Sakshi
Sakshi News home page

‘చే’జారిన మరో ఎమ్మెల్యే! 

Published Sat, Mar 9 2019 1:07 AM | Last Updated on Sat, Mar 9 2019 4:55 AM

Chirumarthi Lingaiah Joined In TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొదలైన ఈ ఆపరేషన్‌ లోక్‌సభ ఎన్నికల్లోగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసేలా టీఆర్‌ఎస్‌ వ్యూహం రచిం చింది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌).. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. వారంలోపే మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌) రెండ్రోజుల్లో అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆదివారం లింగయ్య చేరిక కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.

ఇటీవలి ఎన్నికల్లో నకిరేకల్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వేముల వీరేశంతో చిరుమర్తి లింగయ్య శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. ‘అన్నా పార్టీలో చేరుతున్నాను. కలిసి పని చేద్దాం. సహకరించాలన్నా’అని కోరారు. నకిరేకల్‌లోని కాంగ్రెస్‌ శ్రేణులతోనూ సైతం లింగయ్య ఇదే అంశంపై చర్చించారు. తాజా పరిణామాలతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 12న జరగనుంది. అప్పటిలోపు మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరతారని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తదుపరి చేరికలు ఉంటాయంటున్నారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ శ్రేణులు, నేతల స్థైర్యాన్ని దెబ్బతీసేలా టీఆర్‌ఎస్‌ వ్యూహం అమలు చేయాలని నిర్ణయించింది. కేటీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్‌సభ సెగ్మెంట్ల వారీ సన్నాహక సమావేశాలు ముగిసేలోపు మరికొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం ముగిసిన మరుసటి రోజే ఆ సెగ్మెంట్‌ పరిధిలోని నకిరేకల్‌ ఎమ్మెల్యే లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమైంది. మిగిలిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరిక విషయంలోనూ టీఆర్‌ఎస్‌ ఇదే వ్యూహాన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బ 
కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. శాసనసభ కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌ కలిపి ఈ ఎన్నికల్లో పోటీకి దిగాయి. టీఆర్‌ఎస్‌ తరుపున నలుగురు, ఎంఐఎం నుంచి ఒక్కరు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 స్థానాల్లో గెలిచింది. మిత్రపక్షంగా పోటీ చేసిన టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. రెండు పార్టీలు కలిపి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఒక స్థానం గెలుచుకోవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్‌ తమ తరఫున గుడూరు నారాయణ రెడ్డిని బరిలోకి దించింది. ఆ వెంటనే ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారం క్రితమే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ కూటమి బలం 18కి తగ్గింది. అయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం అధికార పార్టీలో చేరడం ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలిచింది. అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఉన్నారు. మజ్లిస్‌ 7 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపనున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం టీఆర్‌ఎస్, మజ్లిస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 102కు పెరిగింది. రెండు పార్టీలు కలిపి ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement