నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు
ఈ నెల 14న హాజరవుతానని ఆయన సమాధానం
అరెస్టయిన పోలీసు అధికారుల ఫోన్ డేటా రిట్రీవ్‌తో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు
అప్పటి అదనపు ఎస్పీ తిరుపతన్నతో లింగయ్య సంప్రదింపులు జరిపినట్టు నిర్ధారణ
త్వరలో మరికొందరు నేతలను విచారించేందుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు రాజకీయ నాయకుల వైపు మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని వారు కోరగా... మూడు రోజులు గడువు ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారికి లింగయ్య సమాచారం పంపారు. దీంతో గురువారం (14వ తేదీ) హాజరుకావడానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న తరచూ లింగయ్యతో సంప్రదింపులు జరిపినట్టు తేలడంతో.. అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
ఇప్పటివరకు పోలీసు అధికారుల చుట్టూనే..
ఈ ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచీ మొత్తం పోలీసు అధికారుల చుట్టూనే తిరిగింది. డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు అరెస్టు అయ్యారు. కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతోపాటు ఓ మీడియా చానల్ అధినేత శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. నిజానికి ఈ కేసులలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చినా.. ఇప్పటివరకు ఎవరికీ నోటీసులిచ్చి విచారించలేదు. గతంలో ఓ ఎమ్మెల్సీపై లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ అయింది. అయితే తొలిసారిగా మాజీ ఎమ్మెల్యేను దర్యాప్తు అధికారులు విచారణకు పిలిచారు. నకిరేకల్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన చిరుమర్తి లింగయ్య బీఆర్‌ఎస్ పారీ్టకి చెందినవారు కావడం గమనార్హం.
ఫోన్ల నుంచి డేటాను వెలికితీసి..
ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత కొన్ని రోజులకు పోలీసు అధికారుల అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో నిందితులు తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను మార్చేయడం, ఫార్మాట్ చేయడం వంటి చేశారు. అయితే పోలీసులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావుల అరెస్టు తర్వాత వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని.. ఫార్మాట్ చేసిన, డిలీట్ చేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవలే ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చాయి. నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఈ క్రమంలో తిరుపతన్న ఫోన్ డేటాను విశ్లేషించగా.. ఆయనతో చిరుమర్తి లింగయ్య చేసిన సంప్రదింపులు బయటపడ్డాయి. 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికతోపాటు గతేడాది డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో.. వీరి మధ్య కీలక అంశాలకు సంబంధించి సమాచార మార్పిడి జరిగినట్లుగా గుర్తించినట్టు తెలిసింది. దీనితో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో విచారణకు హాజరుకావడానికి మూడు రోజుల సమయం ఇవ్వాలని లింగయ్య కోరగా.. గురువారం విచారణ రావాలని అధికారులు తెలిపారు.
మరి కొందరు రాజకీయ నాయకులకూ..
నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటా ఆధారంగా మరికొందరు రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో లింకు ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ డేటా ఆధారంగా లింగయ్యను విచారించిన తర్వాత మరికొందరు నేతలకు నోటీసులు జారీ చేసి, విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్, రాజకీయ పారీ్టకి చెందిన నగదు రవాణా అంశాలపైనే రాజకీయ నేతల్ని దర్యాప్తు అధికారులు ప్రశ్నించనున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment