
ధనిక విధానాలు విడనాడాలి
హైదరాబాద్: ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధనికవర్గ అనుకూల విధానాలను మార్చుకుని వాగ్దానాల అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలని, ప్రజల ఆకాంక్షలను గుర్తెరగాలని సీపీఎం తెలంగాణ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 9 నెలల పాలనలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజల కలలు కల్లలవుతున్నాయని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సీపీఎం రాష్ర్ట మహాసభ ప్రతినిధుల సభ రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరాలంటే ప్రజోపయోగ విధానాలు అవసరమని అభిప్రాయపడింది.
ఉపాధి అవకాశాలు పెంచేందుకు, సామాజిక న్యాయం, రైతులు, కూలీలు, కార్మికులు, వృత్తిదారులు ఇలా వివిధవర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజల పక్షం వహిం చే ప్రత్యామ్నాయం అవసరమంది. వామపక్షాలు, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడే సంస్థలు, ప్రజాసంఘాలు, వ్యక్తులు, మేధావులు ఐక్యంగా కృషిచేస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టంచేసింది. తెలంగాణలో ఇలాంటి ప్రత్యామ్నాయం కోసం కలసి రావాలని సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు పిలుపునిచ్చాయి. కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి బలపరచగా మహాసభ ఆమోదించింది.
తారాస్థాయిలో ‘ఆపరేషన్ ఆకర్ష్’: తమ్మినేని
గత కాంగ్రెస్, టీడీపీల మాదిరిగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేట్, పెత్తందార్ల ప్రయోజనాల పరిరక్షణకే పనిచేస్తున్నదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములుతో కలసి మహాసభ తీర్మానాన్ని ఆయన మీడియాకు విడుదలచేశారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ భారీ వాగ్దానాలు చేశారని, వాటి అమల్లో మాత్రం విఫలమయ్యారని తమ్మినేని ఆరోపించారు. విపక్షాల ఎమ్మెల్యేలు, నేతలను ఆకర్షించి అధికార పార్టీలో చేర్చుకునే ‘ఆపరేషన్ ఆకర్ష్’ కేసీఆర్ హయాం లో తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధుల కోసం బీజేపీ వద్ద సాగిలపడడం, ఓట్లకోసం ఎంఐ ఎంతో అంటకాగే ప్రయత్నం చేయడం వంటి ప్రమాదకర ధోరణులను కేసీఆర్ విడనాడాలని సూచించారు. తెలంగాణకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని స్థితి లో ఇక్కడి టీడీపీ నేతలున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యామ్నాయ విధానాలతో పరిష్కారం చూపగలిగేవి వామపక్షాలు మాత్రమేనన్నారు.
సచివాలయం తరలింపులో కార్పొరేట్ హస్తం
సచివాలయాన్ని మార్చడం వెనక కార్పొరేట్ హస్తంఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల ఆశలను ప్రభుత్వం వమ్ముచేసిందని విమర్శించారు.
రాష్ట్ర సర్కార్‌పై మెతకవైఖరేల?
రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపట్ల గత కొంతకాలంగా వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పార్టీ ఇంకా మెతకవైఖరిని అవలంబిస్తుండటంపై పలువురు సీపీఎం నాయకులు పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. మహాసభల్లో భాగంగా తమ్మినేని ప్రవేశపెట్టిన రాజకీయ నిర్మాణ నివేదికపై చర్చల్లో భాగంగా కొందరు నేతలు ఈ విషయంలో నాయకత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.