
టీఆర్‌ఎస్ ‘ఆకర్ష్’ మంత్రం!
♦ పాలేరు ఉప ఎన్నిక ముందు చేరికల తంత్రం
♦ మంత్రిని గెలిపించుకునేందుకు విపక్షాలపై మానసిక యుద్ధం
♦ నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను మళ్లీ ప్రయోగించింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు ఈ మంత్ర దండాన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ను బలహీన పరచడం కోసం చేరికల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగానే ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆత్మరక్షణ ధోరణి వల్లే టీఆర్‌ఎస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటోందని పేర్కొంటున్నారు.
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వివిధ పార్టీల మద్దతు కోరడంలో నిగమ్నమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీల నుంచి మద్దతు హామీని పొందింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతు, రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి వల్ల ఆయన కుటుంబానికి అనుకూలంగా వీచే సానుభూతి పవనాలు తమ అవకాశానికి గండికొట్టే ముప్పు ఉందన్న ముందు చూపుతోనే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ను పార్టీలోకి గులాబీ దళం చేర్చుకుంటోందని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి కొద్ది నెలలుగా పువ్వాడ అజయ్ టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ముగియగానే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అయితే అప్పటికే పాలేరు నియోజకవర్గం ఖాళీ కావడం, ఉప ఎన్నిక ఖాయం కావడంతో ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగానే టీఆర్‌ఎస్ ఆయన్ను చేర్చుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఈనెల 27న ఖమ్మంలో జరగనున్న టీఆర్‌ఎస్ 15వ ప్లీనరీ వేదికపైనే పువ్వాడ అజయ్ టీఆర్‌ఎస్‌లో చేరాల్సి ఉన్నా వివిధ కారణాలను పరిగణనలోకి తీసుకుని రెండు రోజులు ముందుగానే గులాబీ కండువాలు కప్పనున్నారని తెలుస్తోంది. ఆయనతోపాటు ఖమ్మం నియోజకవర్గానికి చెందిన మరికొందరు నాయకులు, ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన కొందరు కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది.
మానసికంగా పైచేయి కోసమే...
పాలేరులో ఏకగ్రీవానికి సహకరించాలని ఒకవైపు కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తుండగానే హడావుడిగా టీఆర్‌ఎస్ తమ అభ్యర్థిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ప్రకటించింది. తద్వారా ఎమ్మెల్యేలు చనిపోయిన నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని మరోసారి పక్కన పెట్టింది. వివిధ సమీకరణలను అంచనా వేసిన టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను పరోక్షంగా దెబ్బకొట్టి మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోనూ అక్కడి ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ కుటుంబానికి ఏకగ్రీవంగా వదిలేయలేదు. కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని కోరినా పట్టించుకోని టీఆర్‌ఎస్ పోటీ పడి ఆ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు పాలేరు విషయంలోనూ టీఆర్‌ఎస్ అదే ఫార్ములాను వినియోగిస్తోంది.