సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అధికారాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) శాసనసభలో పరిపూర్ణ మెజారిటీ దిశగా వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో అనుసరించిన వ్యూహాన్నే శాసనసభలోనూ అనుసరించి విపక్ష సభ్యులను అధికారికంగా విలీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. నూతన అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే ఈ ‘ఆపరేషన్’ను పూర్తి చేసి కాంగ్రెస్, టీడీపీలకు భారీ షాక్ ఇచ్చేలా వ్యూహాలకు పదును పెట్టాలనేది పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని సమాచారం. తద్వారా లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీలను రాజకీయంగా మరింత దెబ్బతీయడంతోపాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది.
టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు షురూ...
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకునేలా టీఆర్‌ఎస్ వ్యూహాలు ఇప్పటికే మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం... గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నట్లుగానే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట)లను ఒకేసారి పార్టీలో చేర్చుకొని ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో ఈ దిశగా మొదలైన సంప్రదింపులు కీలక దశకు చేరుకున్నాయని తెలిసింది. అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే టీడీఎల్పీ విలీనం దిశగా నిర్ణయాలు జరగనున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఎమ్మెల్యేల ప్రమాణానికి ముందే తెలంగాణలో టీడీపీ ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోనుంది.
కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే లక్ష్యంగా...
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేయడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. ఇదే తరహాలో అసెంబ్లీలోనూ జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్యా రాములు నాయక్ (వైరా) టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది తమతో కలిసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని టీఆర్‌ఎస్ అధిష్టానం ముఖ్యులు చెబుతున్నారు. వారిలో ఎనిమిది మంది ఏ క్షణమైనా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ముఖ్యులు చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీతో కలసి పని చేసేందుకు నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీలోనూ శాసనమండలి పరిస్థితులే పునరావృతం కానున్నాయి.
ఏమిటీ గులాబీ వ్యూహం..?
జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ అసెంబ్లీలో పరిపూర్ణ మెజారిటీ కోసం వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకుగాను 16 స్థానాల్లో (మిత్రపక్షమైన మజ్లిస్ పోటీ చేసే ఒక సీటు మినహా) గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచి గణనీయ స్థాయిలో లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్... ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో ఒకరకమైన నైరాశ్యం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల వరకు కుదురుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదేశాలతో లోక్‌సభ ఎన్నికలకు టీపీసీసీ సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహంతో కాంగ్రెస్‌ను మరోసారి దెబ్బ కొట్టాలని, ఎమ్మెల్యేల చేరికలు సైతం నలుగురైదుగురితో సరిపెట్టకుండా కాంగ్రెస్ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది.
మండలిలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా రద్దు
శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రద్దయింది. కాంగ్రెస్ శాసనమండలిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీ హోదాను రద్దు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ శాసనమండలిపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు.
మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ...
వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తన పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ ఆమోదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆపరేషన్ అసెంబ్లీ!
Published Sun, Dec 23 2018 1:37 AM | Last Updated on Sun, Dec 23 2018 7:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment