telangana legislative counsil
-
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ హాట్ సీటే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటాలోని రెండు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. సిట్టింగ్ స్థానమైన నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ స్థానా నికి ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎన్నిక జరుగు తుండగా.. గతంలో ఒక్కసారి కూడా ఈ స్థానంలో విజయం సాధించకపోవడాన్ని టీఆర్ఎస్ సవా లుగా తీసుకుంది. ఈ స్థానంలో వరుస ఓటముల అపప్రథను తొలగించుకోవడంతోపాటు దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఈ స్థానంలో గెలుపు ద్వారా పగ్గాలు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు మరోమారు ఎన్నికల బరిలో నిలిచారు. సిట్టింగ్ స్థానంలో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ ఆశిస్తోంది. అందుకే వాణీదేవి గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మహిళా ఓటర్లపై ఆశలు హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవి పేరును టీఆర్ఎస్ పార్టీ చివరి నిముషంలో ఖరారు చేసింది. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించడమే అసలైన నివాళి అని టీఆర్ఎస్ చెబుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో ఒక ప్రధాన రాజకీయ పక్షం మహిళా అభ్యర్థిని బరిలోకి దించడం ఇదే ప్రథమం కావడంతో వాణీదేవి అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా, ఇందులో 1.94 లక్షలు... అంటే సుమారు 36 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. విద్యావేత్తగా వాణీదేవికి ఉన్న గుర్తింపు, ఎలాంటి వివాదాలు లేకపోవపోడం, పీవీ కూతురు కావడం... కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. వాణీదేవిని రాజ్యసభకు ఎందుకు పంపలేదని, శాసనమండలికి నేరుగా ఎందుకు నామినేట్ చేయలేదని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తుండగా టీఆర్ఎస్ మాత్రం పట్టభద్రుల ఆమోదంతో ఆమె మండలిలో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని హోదాలో పీవీ చేపట్టిన సంస్కరణలు, ఆయన వ్యక్తిత్వం, వాణీదేవి అభ్యర్థిత్వం తదితర అంశాలతో పాటు తమ సంస్థాగత బలం కలిసి వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. మంత్రిమండలిలో పది మంది ఇక్కడే శాసనమండలి పట్టభద్రుల ఓటరు నమోదు స్థాయిలో చురుగ్గా వ్యవహరించిన టీఆర్ఎస్ ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ నుంచి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆఖరి దాకా సస్పెన్స్ కొనసాగించింది. చివరి నిముషంలో వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన టీఆర్ఎస్ ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో పెద్ద సంఖ్యలో పార్టీ యంత్రాంగాన్ని ఇక్కడ మొహరించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.కేశవరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగాన్ని కార్యరంగంలోకి దించుతూ.. ప్రచార బాధ్యతలను ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఆరుగురు మంత్రులకు అప్పజెప్పింది. వీరితో పాటు పట్టభద్రుల ఎన్నికలు లేని మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డికి కూడా ఈ స్థానంలో ప్రచార బాధ్యతలు కట్టబెట్టింది. ఇలా మొత్తం పదిమంది మంత్రులు ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించడం, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, పార్టీ వ్యూహం అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు, పథకాల మంజూరులో రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రులు ప్రతిచోటా ఎత్తిచూపుతున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. -
కళాకారులకు దక్కిన గౌరవం ఇది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా గోరేటి వెంకన్నకు శుభాకాంక్షలులు తెలిపారు. ‘తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది’ అని ట్వీట్ చేశాడు. అలాగే మరో ట్విట్లో ‘గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు పూర్వం శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. పాటకు పట్టం కట్టి, ప్రజాకవి గోరెటి వెంకన్న గారిని సమున్నత పదవితో సత్కరించిన సీఎం కేసీఆర్ గారికి వందనాలు’ అని అన్నారు. (చదవండి : గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం ) కాగా, మండలి గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినందుకు గోరేటి వెంకన్నకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. (చదవండి : ‘గవర్నర్ కోటా’ ఖరారు) తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది pic.twitter.com/3fZdZH4tQD — KTR (@KTRTRS) November 15, 2020 -
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాట..
సాక్షి, నాగర్‌కర్నూల్: శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఈయనకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ ) విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాటలకు నాంది పలికారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. విదేశాల్లోనూ సత్కారాలు పొందారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన గోరటి నర్సింహ, ఈరమ్మ మొదటి సంతానం గోరటి వెంకన్న. ఎంఏ (తెలుగు) విద్యాభ్యాసం చేసిన ఈయన ప్రస్తుతం ఏఆర్ సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పలు సినిమాలకు పాటలు రాశారు. ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం సినిమాల్లో రాసిన పాటలను మంచి పేరు వచ్చింది. బతుకమ్మ చిత్రంలో పాటలు రాయడంతో పాటు నటించారు. రాసిన పుస్తకాలు.. ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన అనేక పుస్తకాలు అచ్చయ్యాయి. 1994లో ఏకునాదం మోత, 2002లో రేలపూతలు పుస్తకాలు రాసి 2007లో తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ గేయ కావ్య పురస్కారం అందుకున్నారు. 2010లో అలసేంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2019లో వల్లంకి తాళం, 2019లో ద వేవ్ ఆఫ్ ద క్రెస్సెంట్ వంటి పుస్తకాలను రాసి అవార్డులు అందుకున్నారు. అవార్డులు ఇవే.. 2019లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కబీర్ సమ్మాన్’ జాతీయ అవార్డును అందించింది. 2006లో హంస అవార్డు, 2016లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డు, 2014లో ఉగాది పురస్కారం, 2019లో తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి సినారే అవార్డు, లోక్‌నాయక్ అవార్డు, 2018లో తెలంగాణ మీడియా అకాడమి నుంచి అరుణ్‌సాగర్ అవార్డు, 2007లో అధికార భాషా సంఘం పురస్కారం అందుకున్నారు. -
'కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారింది'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటివెలుగు పథకం కింద కంటి ఆపరేషన్లు ఎవరికి చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తే ఆరోగ్య శ్రీని నిలిపివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్య శ్రీని కూడా కంటిన్యూ చేయాలన్నారు. కాగా బడ్జెట్లో విద్య కోసం రూ.14728 కోట్లు కేటాయించారని, అయితే విద్యపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. (‘అప్పుడు కరెంట్ బందు.. ఇప్పుడు రైతు బంధు’) బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థుల పట్ల పోలీసులు నియంతృత్వంగా వ్యవహరించడం దారుణంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఊసే లేదని, గ్రూఫ్స్ నోటిఫికేషన్ ఇప్పటికి ఇవ్వలేదన్నారు. యునివర్సిటీల్లోనూ పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రేషన్‌షాపుల్లో ఇవ్వాల్సిన తొమ్మిది రకాల సరుకులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పండుగ పూట ఇవ్వాల్సిన చక్కెర, గోధుమలు, కిరోసిన్ లాంటివి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. రుణమాఫీలో భాగంగా రూ. 50వేల వరకు ఉన్న రైతులకు ఒకసారి, 50 వేలకు పైగా ఉన్న రైతులకు రెండు విడతల్లో రుణమాఫీ చేస్తే బాగుంటుందని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి.. టీడీఎల్పీ విలీనం దిశగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అధికారాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభలో పరిపూర్ణ మెజారిటీ దిశగా వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో అనుసరించిన వ్యూహాన్నే శాసనసభలోనూ అనుసరించి విపక్ష సభ్యులను అధికారికంగా విలీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. నూతన అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే ఈ ‘ఆపరేషన్’ను పూర్తి చేసి కాంగ్రెస్, టీడీపీలకు భారీ షాక్ ఇచ్చేలా వ్యూహాలకు పదును పెట్టాలనేది పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని సమాచారం. తద్వారా లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీలను రాజకీయంగా మరింత దెబ్బతీయడంతోపాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు షురూ... అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకునేలా టీఆర్ఎస్ వ్యూహాలు ఇప్పటికే మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం... గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నట్లుగానే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట)లను ఒకేసారి పార్టీలో చేర్చుకొని ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో ఈ దిశగా మొదలైన సంప్రదింపులు కీలక దశకు చేరుకున్నాయని తెలిసింది. అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే టీడీఎల్పీ విలీనం దిశగా నిర్ణయాలు జరగనున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఎమ్మెల్యేల ప్రమాణానికి ముందే తెలంగాణలో టీడీపీ ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోనుంది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే లక్ష్యంగా... కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేయడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. ఇదే తరహాలో అసెంబ్లీలోనూ జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్యా రాములు నాయక్ (వైరా) టీఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది తమతో కలిసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు చెబుతున్నారు. వారిలో ఎనిమిది మంది ఏ క్షణమైనా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీతో కలసి పని చేసేందుకు నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీలోనూ శాసనమండలి పరిస్థితులే పునరావృతం కానున్నాయి. ఏమిటీ గులాబీ వ్యూహం..? జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ అసెంబ్లీలో పరిపూర్ణ మెజారిటీ కోసం వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకుగాను 16 స్థానాల్లో (మిత్రపక్షమైన మజ్లిస్ పోటీ చేసే ఒక సీటు మినహా) గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచి గణనీయ స్థాయిలో లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్... ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో ఒకరకమైన నైరాశ్యం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల వరకు కుదురుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదేశాలతో లోక్‌సభ ఎన్నికలకు టీపీసీసీ సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహంతో కాంగ్రెస్‌ను మరోసారి దెబ్బ కొట్టాలని, ఎమ్మెల్యేల చేరికలు సైతం నలుగురైదుగురితో సరిపెట్టకుండా కాంగ్రెస్ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో టీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది. మండలిలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా రద్దు శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రద్దయింది. కాంగ్రెస్ శాసనమండలిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీ హోదాను రద్దు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ శాసనమండలిపక్షం టీఆర్ఎస్లో విలీనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ... వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తన పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ ఆమోదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఎమ్మెల్యేలకు భద్రత పెంచి మాకు కుదిస్తారా?
హైదరాబాద్: ఎమ్మెల్సీలకు భద్రత కుదించడంపై తెలంగాణ శాసనమండలిలో శుక్రవారం గందరగోళం చెలరేగింది. ఒకే జిల్లాలో ఎమ్మెల్యేలకు భద్రతకు పెంచి ఎమ్మెల్సీలకు కుదిస్తారా అంటూ సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీల ఆందోళనతో సభలో గందరగోళం తలెత్తింది. ఎమ్మెల్సీల సెక్యురిటీపై సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీయివ్వడంతో సభ్యులు శాంతించారు. తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది.