సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ ఆకర్ష్’లో వేగం పెంచాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులను ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలను ఆకర్షించి బీజేపీలో చేర్చుకునే విషయంపై కసరత్తు ముమ్మరం చేయాలని సూచించింది. రాష్ట్ర పార్టీ అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న అధినాయకత్వం ఒకవైపు చేరికలపై రాష్ట్రనేతల వెంటపడుతూనే, చేరికపై ఊగిసలాడుతున్న ఇతర పార్టీల నేతలతో తానే సంప్రదింపులు జరుపుతోంది.
కొంతకాలంగా ఎటూ తేల్చకుండా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంప్రదింపులు జరిపారు. జాతీయపార్టీ ముఖ్యనేతల సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్టుగా ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్, ఇతర నాయకులతో వివిధ పార్టీల ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్టుగా చెబుతున్నారు.
చేరికలకు అత్యంత ప్రాధాన్యత
ఈ నెల 7న రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా నియమితులైన సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన కసరత్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఈటలతోపాటు కమిటీ సభ్యులు డీకే అరుణ, డా.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎ.చంద్రశేఖర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ కూడా ఎవరికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల చేరికలకు సంబంధించి పూర్తిగా నిర్ధారణ అయి, చేరే దాకా ఆ నేతల పేర్లు బయటకు రాకుండా ఉంచాలన్న నాయకత్వం ఆదేశాల నేపథ్యంలో అంతా రహస్య అపరేషన్ సాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ జిల్లాల్లోని ఒకరిద్దరు ఎంపీలు, కొందరు మాజీమంత్రులు/ఎంపీలు/ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, అయితే ముహూర్తం ఎప్పుడనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదని తెలుస్తోంది.
విభిన్న వ్యూహాలతో ముందుకు...
ప్రధాన పార్టీల నుంచి ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చేరేందుకు ముందుకొచ్చే కొందరు నేతలు పోటీచేసే నియోజకవర్గం, తన వెంట వచ్చే నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని కండిషన్లు పెడుతున్నట్లు తెలిసింది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ముఖ్య నేతలకు వెన్నుదన్నుగా ఉన్నవారిపైనా, సమాజంపై ప్రభావం చూపే విద్యావంతులు, వైద్యులు, వివిధ రంగాల మేధావులు, వివిధ సామాజికవర్గాల నేతలు, సంఘాల పెద్దలను కూడా పార్టీలోకి ఆకర్షించేందుకు చర్యలు చేపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment