నల్లగొండ టౌన్: మిషన్ భగీరథ పథకంలో ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణాలు, ఇంట్రా విలేజ్ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేసి.. ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పనులను పరిశీలించేందుకు త్వరలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులు రానున్నట్లు వెల్లడించారు.
ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పనులను పూర్తి చేయాలన్నారు. తప్పులు జరిగితే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భగీరథ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించినందున.. అలసత్యం చేయకుండా ఎంపిక చేసిన ప్రదేశాల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఇప్పటినుంచి పనులపై ప్రతి వారం సమీక్షించి.. ప్రగతిని తెలుసుకుంటామన్నారు. ప్రజలకు మంచి నీరందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
నిబంధనల మేరకే పనులను పూర్తి చేయాలని, ఈ నెల ఏడో తేదీ వరకు వరకు అన్ని పనులను ప్రారంభించాలని ఆదేశించారు, అర్హత ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగించాలని, సమస్యలు రాకుండా స్థానిక అధికారులు చూసుకోవాలని సూచించారు. ఇసుక సమస్య రాకుండా ఆయా మండలాల తహసీల్దార్లు బాధ్యత తీసుకుంటారని చెప్పారు.
కొత్త బోర్లకు అనుమతి లేదని, మరమ్మతులు ఉంటే.. వెంటనే చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకండా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, డీఆర్‌ఓ ఖీమ్యానాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘భగీరథ’ పనుల్లో నిర్లక్ష్యం వద్దు..
Published Wed, Apr 5 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
Advertisement
Advertisement