రెడీ 1.. 2.. 3
సంక్రాంతి లోపే ట్రయల్ రన్
వేగం పెరిగిన మిషన్ భగీరథ పనులు
ఈనెల చివరిలోగా శాయంపేట మండలానికి తాగునీరు
మార్చిలో పరకాల నియోజకవర్గంలోని 150 గ్రామాలకు..
రూ.198 కోట్లతో 15మండలాల్లో ఇంట్రా విలేజ్ పనులు
ప్రధాన పనులతో సమాంతరంగా గ్రామాల్లోనూ కొనసాగింపు
హన్మకొండ : రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం పనులు వరంగల్ రూరల్ జిల్లాలోగా జోరందుకున్నాయి. సంక్రాంతి పండుగ లోపు.. అంటే ఈనెల 14వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు పనులు చేపడుతున్న కాంట్రాక్టు వర్గాల ద్వారా తెలుస్తుండగా.. కలెక్టర్ మొదలు కింది స్థాయి అధికారుల వరకు రోజురోజు పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. దీంతో కొంతకాలం క్రితం వరకు నిదానంగా సాగిన పనులు తాజాగా వేగం పుంజుకున్నాయి. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రూరల్ జిల్లాలోని పరకాల, శాయంపేట, దామెర మండలాల్లో పనులను పరిశీలించి ఆలస్యంగా జరుగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. పనుల్లో వేగం పెంచాలని ఆయన ఆదేశించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అంతేకాకుండా మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించడమే కాకుండా తరచుగా పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో పనుల్లో వేగం పెరిగింది. ఇక సంక్రాంతి పండుగ లోపు ఈనెల 14వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కాంట్రాక్టర్ చెబుతుండడంతో మండల వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఈనెలలోనే ఫలాలు
మిషన్ భగీరథ ఫలాలు జిల్లా వాసులకు ఈ నెలలో అందనున్నాయి. మొదటి విడతలో భాగంగా ఈనెల చివరకల్లా శాయంపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు తాగునీరు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో కాంట్రాక్టర్లను అధికారులు ఎప్పటికప్పుడు వేగిరం చేస్తున్నారు. ఈ మేరకు చలివాగు ప్రాజెక్టు, మైలారం గుట్టలపై చేపట్టిన పనులు ఓ కొలిక్కి వస్తుండడంతో ఈనెల చివరకు వరకు శాయంపేట మండల ప్రజలకు తాగునీరు అందించొచ్చని భావిస్తున్నారు. ఇక మార్చి నెలలోగా పరకాల నియోజకవర్గంలోని 150 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో మిగతా ప్రాంతాల్లో పనులు చేయిస్తున్నారు.
చలివాగులో ఇన్ టేక్‌వెల్
చలివాగు ప్రాజెక్టుకు సంబంధించి శాయంపేట మండలం జోగంపల్లి వద్ద మిషన్ భగీరథలో భాగంగా ఇన్ టేక్‌వెల్ నిర్మించారు. దీనికి సమీపంలోనే పంప్‌హౌస్ కూడా కట్టారు. ఇక మైలారం గుట్టపై ఓవర్‌ట్యాంకు నిర్మిస్తుండగా.. ఆ ట్యాంకు గ్రావిటీ ద్వారా మండలంలోని 18 గ్రామాలకు గోదావరి జలాలు అందించాలన్న అధికారుల లక్ష్యం. చలివాగు ప్రాజెక్టుకు దేవాదుల రెండో దశ ప్రాజె క్టు నుంచి రెండు పంప్ మోటార్ల ద్వారా గోదావరి నీరు వ స్తుంది. కాగా, దివంగత ముఖ్యమంత్రి సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జోగంపల్లి వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ మేరకు చలివాగులో ఉన్న ఇన్ టేక్‌వెల్, సమీపంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌తో పాటు తాజాగా నిర్మించిన ఇన్ టేక్‌వెల్ ద్వారా శాయంపేటలోని 18 గ్రామాలకు.. ఆపై పరకాల మండలంలోని గ్రామాలకు తాగునీరు అందనుంది.
ఇంట్రా విలేజ్ పనులపై కలెక్టర్ నజర్..
ఇంటింటికీ తాగునీరు అందించేందుకు గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంట్రా విలేజ్(అంతర్గత గ్రామాల) పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 15 గ్రామాల్లో పనులు చేపట్టేందుకు రూ.198కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే, ఈ పనులను ఒకటి తర్వాత మరొకటి కాకుండా.. ప్రధాన పనులకు సమాంతరంగా గ్రామాలు, ఆవాసాల్లో చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు శాయంపేట మండలం జోగంపల్లి వద్ద పంప్‌హౌస్, ఫిల్టర్‌బెడ్, మెకానికల్ పనులు, మోటార్లకు కనెక్షన్లు ఇవ్వడం వంటివి వారంలోగా పూర్తి చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు శాయంపేట మండలంలో రూ.10.68కోట్లతో ఇంట్రావిలేజ్ పనులు చేపట్టనున్నారు. ఇక ఈనెల 14వ తేదీన ట్రయల్‌రన్‌కు రంగం సిద్ధం చేస్తుండడం విశేషం.