బావిలో విషం
► గుర్తుతెలియని దుండగుల దుశ్చర్య
► తాగునీటిలో పురుగుల మందు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు
► పరిశీలించిన ఎంపీడీఓ, ఎస్‌ఐ
రేగోడ్(మెదక్): గుర్తు తెలియని వ్యక్తులు ఓ బావిలో విషం కలిపారు. ఈ విషయం స్థానికులు గుర్తించకపోతే ఆ బావి నీళ్లు తాగినవారి ప్రాణాలు గాల్లో కలిసుండేవి. ఈ సంఘటన రేగోడ్ మండలం దోసపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పట్టేపొలం తండాలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టేపొలం తండాలోని బావిలో ఉన్న నీళ్లను తాగేందుకు తీసుకెళుతుంటారు.
అయితే బావి విద్యుత్ మోటారు రెండు రోజుల క్రితం చెడిపోయింది. మోటారును మరమ్మతుల కోసం తీసుకెళ్లేందుకు శుక్రవారం బావి వద్దకు స్థానికులు రాగా పురుగుల మందు వాసన వచ్చింది. గమనించిన స్థానికులు బావిలో పురుగుల మందు ఎవరో కలిపినట్లుగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే బావిలోని నీళ్లను ఎవరూ తోడవద్దని తండావాసులకు తెలిపిన గిరిజనులు మండల అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎంపీడీఓ బస్వన్నప్ప, ఎస్‌ఐ జానయ్య తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
బావిలో పురుగుల మందును కలిపేందుకు గల కారణాలను తండావాసులను అడిగి తెలుసుకున్నారు. ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవతో బావిలో విషం కలిపేందుకు కారణమయినట్లు పుకార్లు శికార్లు చేస్తున్నాయి. బావిలో నుంచి నీళ్లను ఎవరూ తీసుకోవద్దని, ఎవరూ తాగవద్దని తండావాసులకు సూచించారు. బావిలో విషం కలిపినట్లు ఆరోపణలు రావడంతో నీళ్ల శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. విషం కలిపిన నీళ్లు తాగి ఉంటే ఏమయ్యేవారమని పలువురు తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే తండాలో గురువారం ఓ అమ్మాయి విషయంలో ఇరువర్గాలు గొడవ పడిన రాత్రే బావిలో విషం కలవడం చర్చనీయాంశంగా మారింది. గొడవ పడిన ఇరువర్గాలవారిని తండావాసులు రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. తండాలో ఇంత జరిగినా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సందర్శించకపోవడం వారిపని తీరుకు నిదర్శనంగా నిలిచింది. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ వర్క్ ఇన్‌స్పెక్టర్ పవన్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏఈ సాయినాథ్‌ను వివరణ కోరగా ఆ విషయం తనకు తెలియదని సమాధానం ఇవ్వడం విశేషం.
ఎస్‌ఐ వివరణ
స్థానిక ఎస్‌ఐ జానయ్యను వివరణ కోరగా పట్టేపొలం తండాలోని బావిలో విషం కలిపిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.