
మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి రండి
గవర్నర్‌ను ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 7న జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం శరవేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందని, ముందుగా గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు గవర్నర్ సైతం అక్కడికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ గవర్నర్‌తో గంట సేపు సమావేశమయ్యారు.
సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సీఎం వెంట ఉన్నారు. ఈ నెల 7న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. దీంతో పాటు ఎంసెట్-2 పరీక్ష లీకేజీ, మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు దారి తీసిన పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం.