నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం  | Today is the State Foundation Day | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 

Published Sun, Jun 2 2019 2:05 AM | Last Updated on Sun, Jun 2 2019 8:56 AM

Today is the State Foundation Day - Sakshi

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించిన అసెంబ్లీ భవనం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఐదు వసంతాలు పూర్తిచేసుకుని ఆరో వసంతంలో అడుగిడింది. ఎన్నో పోరాటాలు, ఎందరో బలిదానాల ప్రతిఫలంగా 2014 జూన్‌ 2న 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. ఆదివారం ఐదో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో జూన్‌ 3న 1001 మంది కళాకారులతో పేరిణి మహా నృత్య ప్రదర్శన, 4న 5 వేల మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాసాన్ని ప్రదర్శించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా, రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. 

అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు.. 
రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సైతం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించే బాధ్యతను రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్‌ (ఖమ్మం), ఈటల రాజేందర్‌ (కరీంనగర్‌), శ్రీనివాస్‌ గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), మల్లారెడ్డి (మేడ్చల్‌), ఇంద్రకరణ్‌ రెడ్డి (నిర్మల్‌), వి.ప్రశాంత్‌రెడ్డి (నిజామాబాద్‌), జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), దయాకర్‌రావు (వరంగల్‌ అర్బన్‌), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్‌ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్‌ లక్ష్మణ్‌ (జయశంకర్‌ భూపాలపల్లి), ఏకే గోయల్‌ (కొమురంభీం ఆసిఫాబాద్‌), ఏకే ఖాన్‌ (మహబూబాబాద్‌), రాజీవ్‌ శర్మ (మంచిర్యాల), అనురాగ్‌ శర్మ (నాగర్‌ కర్నూల్‌), డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ (నల్లగొండ), ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (వరంగల్‌ రూరల్‌), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్‌), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్‌ (జోగులాంబ గద్వాల), దఫేదార్‌ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్‌), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్‌), బాలు నాయక్‌ (యాదాద్రి భువనగిరి) ఆయా జిల్లాల్లో జరిగే రాష్టర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.  

వినూత్నంగా ఆవిర్భావ వేడుకలు 
రాష్ట్ర అవతరణ దినోత్సవం అనగానే సీఎం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం, జెండా ఆవిష్కరించడం, సీఎం  ప్రసంగం, ఎట్‌హోం కార్యక్రమంలాంటి పలు అధికారిక కార్యక్రమాలు అందరికీ గుర్తుకు వస్తాయి. వాటితో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భాషా సాంస్కృతిక శాఖ విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్, జూబ్లీహాల్, రవీంద్రభారతిలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, కూచిపూడి నృత్యం, జయజయహే తెలంగాణ నృత్య రూపకం, పేరిణి నృత్యం, ఒడిస్సీ నృత్యం, అవతరణ ఫిల్మోత్సవం, షార్ట్‌ఫిల్మ్‌ల స్క్రీనింగ్‌ వంటి పలు కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా నిర్వహించనున్నారు. 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలతో అలంకరించిన అమరవీరుల స్తూపం 

48 గంటల ‘ఫిల్మ్‌ మేకింగ్‌ ఛాలెంజ్‌’
ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్‌కి పదును పెట్టుకుంటూ కొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ కేంద్రంగా సినీవారం, సండే సినిమా కార్యక్రమాలను రూపొందించారు. ప్రతిఏటా నిర్వహించే పోటీలా కాకుండా ఈ సంవత్సరం అవతరణ ఫిల్మోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 48 గంటల ఫిల్మ్‌ మేకింగ్‌ ఛాలెంజ్‌ ని తెలంగాణ ఫిల్మ్‌ మేకర్స్‌ కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌ మేకింగ్‌ మారథాన్‌ గతనెల 24 సాయంత్రం 7 గంటలకు మొదలై 26 సాయంత్రం ఏడు గంటలకి ముగిసింది. భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్‌ లేదా కేరెక్టర్‌ని వాడి నాలుగు నుంచి ఎనిమిది నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌ చేయడం ఇందులో ప్రత్యేకత. విజేతలకు జూన్‌ 3న రవీంద్రభారతి లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. 

మాధ్యమాల ద్వారా చేరువవుతున్న తెలంగాణ సంస్కృతి 
ప్రజలకు తొందరగా చేరువయ్యే ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు యువత తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్ప డానికి కృషిచేస్తున్నారు. గానం, నృత్యం, హావభావాలు, వేషధారణ వంటి అంశాలు ప్రస్ఫుటంగా కనిపించేలా షార్ట్‌ఫిల్మ్‌ తీయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న నెటిజన్ల సంఖ్య, యూట్యూబ్, అంతర్జాలవాడకం వం టి పలు అంశాలను పరిగణనలోకి తీసు కుని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం జూన్‌ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ‘ఫిల్మోత్సవం’పేరిట షార్ట్‌ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. 

ఈసారి భిన్నంగా వేడుకలు
‘‘రవీంద్ర భారతిలో మూడు రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మొదటిరోజు అవార్డుల కార్యక్రమం, రెండోరోజు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యం, గానం, అదేవిధంగా సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, తెలంగాణ గీతాలు, జూన్‌ 2న ఉదయం కవిసమ్మేళనం, సాయంత్రం చైతన్య గీతాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రతియేటా నిర్వహించే అవతరణ దినోత్సవానికి కొంచెం భిన్నంగా 48 గంటల్లో ఫిల్మ్‌మేకింగ్‌ ఛాలెంజ్‌ని నిర్వహించాలనుకున్నాం. ఔత్సాహిక యువత తమ ప్రతిభను మెరుగుపరచడానికి సినీవారం, సండేసినిమా, ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించాం. వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ఆసక్తిగల సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక అద్భుతమైన  అవకాశం.’’ 
–మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌  

తెలంగాణ సుభిక్షంగా ఉండాలి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌  
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలన్నారు. ‘ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలమానం. రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ నిబద్ధతతో, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలి. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement