సాక్షి, హైదరాబాద్ : ‘ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసాను. గవర్నర్‌గా ఇన్నేళ్ల ప్రస్థానం పూర్తి సంతృప్తినిచ్చింది. తెలుగువారి ఆత్మీయాతానురాగాలతో వెళ్తున్నా’అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌ను కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వంగా మధ్యాహ్నం 3.30 గంటలకు నరసింహన్‌ని కలిశారు. సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన భేటీలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అత్యంత సుదీర్ఘకాలం గవర్నర్‌గా ఉమ్మడి ఏపీకి, తెలంగాణ ఏపీలకు గవర్నర్‌గా పనిచేయడం తన అదృష్టమని ఈ సందర్భంగా నరసింహన్ అన్నారు. ఇంతకాలం తెలుగు ప్రజలకు సేవచేయాల్సి రావడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతకాలం ఏపీ, తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రతిష్టాత్మక, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం, రాష్ట్రపతి పాలన వంటి చారిత్రక ఘటనలకు సాక్షీభూతంగా నిలవడం జీవితంలో మరిచిపోలేన్నారని తెలిసింది.
ఆదివారం గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం కేసీఆర్
పథకాలపై ప్రశంసలు
తెలంగాణలో చేపట్టిన వివిధ పథకాలను గవర్నర్ నరసింహన్ ప్రశంసించినట్లు తెలిసింది. కాళేశ్వరం, రైతుబంధు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు కేసీఆర్‌ను అభినందించారని సమాచారం. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో 9ఏళ్ల 8 నెలల సుదీర్ఘ సమయం గవర్నర్‌గా తనకు పూర్తిసంతృప్తినిచ్చిందని గవర్నర్ అన్నారని తెలిసింది. తెలుగు ప్రజలు పంచిన ఆత్మీయత, అనురాగాలు, జ్ఞాపకాలతో వెళుతున్నానని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో మరింత పురోగమించాలని ఆయన ఆకాంక్షించారు.
థ్యాంక్యూ మిస్టర్ గవర్నర్!
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత తొలి గవర్నర్‌గా పరిపాలనలో తనకు ఎంతగానో సహకరించిన నరసింహన్‌కు కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలు కీలకమైన బిల్లులు, పథకాల ఆమోదం, అమలులో నరసింహన్ సలహాలు మరువలేనివని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గవర్నర్ అందించిన సహకారాన్ని కొనియాడారు. గవర్నర్ నరసింహన్ పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన తెలంగాణకు అందించిన సేవలను తెలంగాణ ప్రజలు ఎన్నిటికీ మరిచిపోరని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రస్థానంలో ఆయన గవర్నర్‌గా ఉన్న సమయాన్ని ప్రత్యేక పేజీగా అభివర్ణించారు. గవర్నర్‌గా 2009 నుంచి 2019 వరకు నరసింహన్ పలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం, రాజీనామాలు, ఉప ఎన్నికలు, ఓటుకు నోటు కేసు వంటి కీలక ఘట్టాలను మరోసారి ఇద్దరూ తలచుకున్నారు. ఉద్యమకారుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా గవర్నర్ హయాంలో జరిగిన ఘటనుల గుర్తుచేసుకున్నారు.
త్వరలో గవర్నర్ దంపతులకు సన్మానం
ఇంతకాలం తెలంగాణకు సేవలందించిన గవర్నర్ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకనుంది. రెండ్రోజుల్లో రాజ్‌భవన్‌లో భారీగా వీడ్కోలు సభను ఏర్పాటుచేసి నరసింహన్ దంపతులను ఘనంగా సన్మానించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ రంగాల ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వనించనున్నారు. తెలంగాణకు నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ మరో వారం రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
కేంద్ర సర్వీసుల్లోకి నరసింహన్!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నియమితులైన నేపథ్యంలో సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా, తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన అనంతరం నరసింహన్‌ను కేంద్ర హోంశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ వర్గాలు కోరినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment