
రూ.10 వేల కోట్ల కుంభకోణం
నిరూపించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కోమటిరెడ్డి సవాల్
⇒ సభా సంఘంతో విచారణకు డిమాండ్
⇒ కోమటిరెడ్డికి కాంట్రాక్టర్లపైనే ధ్యాస ఎందుకోనని కేటీఆర్ ఎద్దేవా
⇒ జనానికి మంచినీళ్లు ఇస్తే తమ కాళ్ల కిందకు నీళ్లొస్తాయని కాంగ్రెస్‌లో భయం
⇒ సభా సంఘం వేయాల్సిందే: జానారెడ్డి
⇒ అసెంబ్లీలో మిషన్ భగీరథపై తీవ్ర వాదోపవాదాలు.. కాంగ్రెస్ వాకౌట్
ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 30 శాతం మొత్తానికి కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం. దీని విలువ రూ.10 వేల కోట్లు. విద్యావంతుడైన మంత్రి కేటీఆర్ నా ఆరోపణలపై స్పందించిన తీరు దారుణం. నేను ఊరకే మాట్లాడ్డం లేదు. దీన్ని నిరూపించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా..
– కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి
గత సమావేశాల్లోనూ కోమటిరెడ్డిది ఇదే తీరు. నల్లగొండ ప్రజలకు నీళ్ల గురించి అడక్కుండా కాంట్రాక్టర్లు, టెండర్లపైనే ఎందుకు దృష్టి. అవినీతిపై ఆయన మాట్లాడటం హాస్యాస్పదం. కోమటిరెడ్డిది స్వీయ మానసిక ఆందోళన.. దాన్ని ప్రజలపై రుద్దొద్దు. ప్రజలకు నీళ్లు ఇస్తే తమ కాళ్లకిందకు నీళ్లొస్తాయనేది కాంగ్రెస్ భయం. మిషన్ భగీరథలో అవినీతి లేదు. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోమనండి..
– మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బుధవారం మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గ్రామీణ నీటి సరఫరా పద్దుపై కేటీఆర్ మాట్లాడిన తర్వాత పలువురు సభ్యులు సందేహాలు అడి గారు. ఈ సమయంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం మంచిదేనని, అయితే ఇందులో కాంట్రాక్టర్లు పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకున్నారని ఆరోపించారు. కొందరు కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడ్డ తీరును ప్రస్తావిస్తూ ఏ ప్యాకేజీ ఏ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారో పేర్లు చదివారు. 26 ప్యాకేజీలుగా సాగుతున్న రూ.32,582 కోట్ల పనుల్లో 30శాతం మొత్తాన్ని సబ్ కాంట్రాక్టర్ల నుంచి ప్రధాన కాంట్రాక్టర్లు వసూలు చేశారని, రూపాయి పెట్టుబడి లేకుండా వారు రూ.10 వేల కోట్లు దండుకున్నారని ఆరోపణలు గుప్పించారు.
దీనిపై వెంటనే సభా సంఘం వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది ఆంధ్రా కాంట్రాక్టర్ల దోపిడీ అంటూ గట్టిగా మాట్లా డారు. దీనికి కేటీ«ఆర్ స్పందిస్తూ.. గత సమావేశాల్లోనూ కోమటిరెడ్డి ఇవే మాటలు మాట్లాడారని, ఆ ప్రాజెక్టుతో నల్లగొండకు మంచినీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తే ప్రజలు కూడా హర్షించేవారని, కానీ దాన్ని వదిలి కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్లు, టెండర్లు అంటూ మాట్లాడ్డం దారుణ మన్నారు. దీనికి కోమటిరెడ్డి మరింత తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘నల్లగొండ తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతుంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే నేను 11 రోజులు నిరసన దీక్ష చేశా. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే నల్లగొండకు సాగర్ నీటిని అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించిన విషయం మరిచిపోవద్దు. ఇప్పుడు 80 శాతం గ్రామాలకు మంచినీళ్లు అందుతున్న విషయం నిజమో కాదో మంత్రి తెలుసుకోవాలి. నేను ఊరకే ఆరోపణలు చేయటం లేదు. నా వద్ద అవినీతిపై సాక్ష్యాలున్నాయి.
వాటిని నిరూపించ లేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా.. ఇది నా సవాల్..’’ అని పేర్కొన్నారు. దీనిపై మళ్లీ కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మిషన్ భగీరథలో 0.52 శాతం లెస్‌కు టెండర్లు కేటాయించామని, దీంతో ప్రజాధనం ఆదా అయిందని చెప్పారు. ఈ సమ యంలో కోమటిరెడ్డి ఏదో అంటుండటంతో ‘నేను అంకెలు చెప్తుంటే రంకెలెందుకు వేస్తున్నారని, ఈ ఆవేశం ఫ్లోరైడ్ బాధితుడిని ప్రధాని టేబుల్‌పై పడుకోబెట్టి మాట్లాడి నప్పుడు చూపి ఉంటే బాగుండేది..’ అని అన్నారు. ప్రజలకు నీళ్లు ఇస్తే తమ కాళ్ల కిందకు ఎక్కడ నీళ్లు వస్తాయోనని కాంగ్రెస్ నేతలు బుగులుపడుతున్నారన్నారు. దీంతో మళ్లీ కల్పించుకున్న కోమటిరెడ్డి.. మంత్రులకు ఇదో ఫ్యాషన్ అయిందని, గోదావరి నీటిని గ్రామాలకు తరలించే పనులు కాంగ్రెస్ చేపడితే దాన్ని మిషన్ భగీరథగా చూపి గజ్వేల్‌కు ప్రధానిని తీసుకొచ్చి నల్లా ప్రారంభించారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కాంట్రాక్టర్లకు కాకుండా ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించటం దారుణమని, భగీరథలో జరు గుతున్న అవినీతి దేశంలో మరెక్కడాలేదని దుయ్యబట్టారు. వెంటనే భగీరథపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి హరీశ్ జోక్యం చేసుకుని.. ఓ క్లారిఫికేషన్ కోసం కోమటిరెడ్డి ఇన్నిసార్లు మైకు తీసుకుని ఆరోపణలు చేయటం సభా సమయాన్ని వృథా చేయట మేనన్నారు. అందుకు విపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుని పథకాన్ని తాము విమర్శించటం లేదని, అందులో జరిగిన అవినీతినే ప్రశ్నిస్తున్నామన్నారు.
సభ్యుడు కోరినట్టుగా సభా సంఘాన్ని వేసి అవినీతి లేదని ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోమటిరెడ్డి ఒత్తిడికి తలొగ్గి జానారెడ్డి సభా సంఘాన్ని డిమాండ్ చేసినట్టు కనిపిస్తోందని, మొహమాటానికి వెళ్లి ఇలా అడగటం భావ్యం కాదని కేటీఆర్ అన్నారు. అందుకు జానారెడ్డి లేచి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయా లన్న దురభిప్రాయం తమకు లేదని, సభాసంఘం వేసి వాస్తవాలు ప్రజల ముందుపెట్టాలని, దీనికి అంగీకరిం చనందున వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
కేసీఆర్ మళ్లీ సీఎం అయితే నేను ఎమ్మెల్యేగా ఉండను: కోమటిరెడ్డి
వచ్చే ఎన్నికల్లో నెగ్గి, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తాను ఎమ్మెల్యేగా ఉండనని ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కోమటిరెడ్డి అంటే ఏమిటో, ప్రజల సమస్యల గురించి పోరాటం ఎలా చేస్తానో ఇక ముందు చూస్తారని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో నిర్మించాలనుకుంటున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో అనేక సమస్యలు వస్తాయని, లక్ష మందితో కలసి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటానని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా.. వారితో కలసి పనిచేస్తానన్నారు. జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతునిస్తానని చెప్పారు.
సభా సంఘంతోనే వాస్తవాలు: కాంగ్రెస్
మిషన్ భగీరథలో అవినీతిపై సభాసంఘం వేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. మిషన్ భగీరథలో 20 నుంచి 25 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలకు ఈ స్కామ్‌లో భాగముందన్నారు.