
‘‘మిషన్ భగీరథ’ దాహం తీర్చదు’
అలంపూర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఇప్పట్లో దాహార్తి తీర్చేదికాదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. సోమవారం రాత్రి ఆయన అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం టూరిజం హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్లు అడుగంటాయని అన్నారు.
జిల్లాలోని అలంపూర్ గద్వాల, వనపర్తి తదితర పరిసరాల్లో నీటిఎద్దడిని గమనిస్తే ప్రభుత్వ చర్యలు కనిపించడం లేదన్నారు. నీటిఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని కోరారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఎంతో చైతన్యవంతంగా కృషిచేస్తున్నారని, ఆయన ప్రయత్నాలకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
అలంపూర్ ఆలయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని కోరారు. అయితే ఎంపీ అంగరక్షకులు ఆలయంలోకి ఆయుధాలు తీసుకెళ్లడంపై టీఆర్‌ఎస్ నాయకుడు నరేష్ ఆనందభాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆయన స్పందిస్తూ ఆలయంలోకి తీసుకురాలేదు కదా! అని అన్నారు. ఎంపీ వెంట తహసీల్దార్ మంజుల, ఎస్‌ఐ పర్వతాలు ఉన్నారు.