ఎవడు నిజమైన సంపన్నుడు?
సువార్త
ధనబలంతో దేవుణ్ణి కూడా కొనవచ్చుననుకున్నారు వాళ్లంతా! కానీ తన చిరుకానుకను దేవుడు మెచ్చితే చాలనుకుంది ఆ పేద విధవరాలు!డబ్బే సర్వస్వమై అది చివరికి ధర్మాన్నీ, దేవాలయ విధివిధానాన్నీ కలుషితం చేస్తున్న నేపథ్యంలో యేసుక్రీస్తు ఒక నిజమైన మహాదాతను లోకానికి పరిచయం చేశాడు. ఆలయంలోని కానుకల పెట్టెలో తనకున్న రెండు కాసుల్నీ వేసి ఆనందంగా ఇంటికెళ్లిన నిరుపేద విధవరాలు ఆమె. ఆమె చిరుకానుకను యేసు ఆకాశానికెత్తి కీర్తించారు. అప్పట్లో అది సంచలనం! అంతా తమ కలిమిలో నుండి ఇచ్చారు. కానీ, ఆమె తన లేమిలో నుండి ఇచ్చిందని యేసు వివరించాడు (మార్కు 12:41-44).
ధన, బలప్రదర్శనకు దాతృత్వాన్ని వాడుకొంటున్న స్వార్థపరులైన దాతల సరసన యేసు ఆమెను నిలబెట్టలేదు. తన కానుకతో దేవుణ్ణే మెప్పించి ఆశీర్వాదాలు పొందిన అరుదైన వర్గంలో ఆమెను చేర్చాడు. ‘పరలోకరాజ్యం’ తర్వాత యేసు ప్రభువు ఎక్కువగా బోధించిన అంశం ‘ధనం’. మనిషి ‘డబ్బు’ పట్ల అనుసరించే వైఖరితోనే పరలోకాన్ని పొందడమో, పోగొట్టుకోవడమో జరుగుతుంది. అది గ్రహించి యేసు ఎన్నో హెచ్చరికలు చేశాడు. ‘ధనసమృద్ధి’ అనేది శీలదారిద్య్రానికి తావిచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ధనికులు తమ వైఖరి వల్ల పరలోకరాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని కూడా చెప్పాడు (లూకా 18:24).
డబ్బుకున్న ‘విధ్వంసకశక్తి’ని అందరి కన్నా ముందే యేసు పసిగట్టి అందుకు విరుగుడు విధానాల్ని తన బోధల్లో చేర్చాడు. తల్లితండ్రుల నుండి పిల్లల్ని వేరు చేసి, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అడ్డుగోడల్ని సృష్టించే శక్తి ధనానిది. దాని ప్రభావం మనిషిని అవలీలగా దేవుని నుండి పరలోకరాజ్యం నుండి దూరం చేయగలదని యేసు ముందే గ్రహించాడు. అందుకే, దాతృత్వం ధనంతో కాదు మనిషి స్వభావం, హృదయంతో ముడిపడిన అంశం అన్నాడాయన. మనిషి దాతృత్వానికి దేవుని పట్ల అతనికున్న విధేయత, విశ్వాసం, ప్రేమ పునాదిగా ఉంటే అది లోకకల్యాణం అవుతుందని ప్రభువు అన్నాడు.
అలాంటి ‘ఇవ్వడం’ వల్ల విశ్వాసి మరింత బలపడతాడు. అయితే స్వార్థపూరితమైన ఆలోచనలతో, ఇంకేదో ఎక్కువగా రాబట్టుకోవాలన్న వ్యూహంతో ‘ఇచ్చే’ కానుకలు అతణ్ణి మరింత బలహీనపరుస్తాయి. కొంత దాచుకోకుండా అంతా ఖర్చు చేయడం ఎంత అవివేకమో, ధనశక్తితో నిరుపేదలను, నిరాశ్రయులను ఆదుకోకుండా, వారికివ్వకుండా అంతా దాచుకోవడం అంతకన్నా అవివేకం! (మత్తయి 6:9-20). ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలన్న దురాశతో మనిషి ‘బంగారు పంజరం’లో చిక్కుకున్నాడు. సొంతంగా ఏరి తెచ్చుకున్న పుల్లలతో కట్టుకున్న గూట్లో పక్షికున్న హాయి, వెచ్చదనం, ఆనందం... పంజరంలోని పక్షికెక్కడిది? అందుకే తన వద్ద ఉన్న రెండు కాసుల్నీ దేవునికిచ్చి, రేపటి అవసరాన్ని దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసంతో ఆనందంగా తన గూటికి వెళ్లిపోయింది - పేద విధవరాలు. పోటీలు పడి ఒకర్ని మించి మరొకరు అత్యధికంగా కానుకలు వేసిన ప్రముఖులంతా ఇంకా ఎక్కువగా సంపాదించే తాపత్రయంలో బంగారు పంజరంలో చిక్కి, శాంతిని పోగొట్టుకున్న పక్షులయ్యారు. నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడం కాదు... ఈ లోక ధనాన్ని పరలోక ధనంగా మార్చుకొనే వాడే నిజమైన సంపన్నుడు!
కొంత దాచుకోకుండా అంతా ఖర్చు చేయడం ఎంతో అవివేకం. ఇక, ధనశక్తితో నిరుపేదలనూ, నిరాశ్రయులనూ ఆదుకోకుండా, వారికివ్వ కుండా అంతా దాచుకోవడం అంతకన్నా అవివేకం! (మత్తయి 6:9-20).
రెవ. డాక్టర్ టి.ఎ.ప్రభుకిరణ్