టీవీఎస్ మోటార్ స్పీడ్...
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం(స్టాండ్‌ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 23 శాతం వృద్ధి సాధించింది. గత క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.116 కోట్లకు పెరిగిందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,667 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,881 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వాహన విక్రయాలు 6,76,139 నుంచి 0.3 శాతం వృద్ధితో 6,78,718కు పెరిగాయని, అయితే మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు మాత్రం 6.48 లక్షల నుంచి 0.3 శాతం క్షీణతతో 6.46 లక్షలకు తగ్గాయని తెలిపింది.
స్కూటర్ల అమ్మకాలు 1.9 లక్షల నుంచి 12 శాతం వృద్దితో 2.18 లక్షలకు పెరగ్గా, మోటార్ సైకిళ్ల విక్రయాలు స్వల్ప వృద్ధితో 2.55 లక్షలకు చేరాయని వివరించింది. ఎగుమతులు 1.03 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 1.27 లక్షలకు చేరాయని పేర్కొంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి నికర లాభం (స్టాండ్‌ఎలోన్) రూ.167 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.207 కోట్లకు చేరిందని, మొత్తం ఆదాయం రూ.4,960 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.5,489 కోట్లకు పెరిగిందని వివరించింది.
మొత్తం టూవీలర్ల విక్రయాలు 12,60,252 నుంచి 4 శాతం వృద్ధితో 13,16,751కు పెరిగాయని పేర్కొంది. పండుగల సీజన్ శుభారంభాన్ని ఇచ్చిందని, ఈ పండుగల సీజన్‌లో మంచి అమ్మకాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్ 13 శాతం వృద్ధితో రూ.276 వద్ద ముగిసింది.